
20 వేల మందికి ‘సాయం’ నిల్!
అనంతపురం అగ్రికల్చర్: ఎదురుచూపులు, అనేక వాయిదాల అనంతరం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడత కింద శనివారం పీఎం కిసాన్ కింద రూ.2 వేలతో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు జమ చేస్తామని ప్రకటించింది. అనేక కొర్రీలు వేయడంతో దాదాపు 20 వేల మందికి పెట్టుబడిసాయం దక్కే పరిస్థితి కనిపించడం లేదు.
తొలి ఏడాది రూ.400 కోట్ల ఎగనామం
అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే ప్లేటు ఫిరాయించారు. అదిగో ఇదిగో అంటూనే 14 నెలలు కాలం గడిపేశారు. ఇప్పుడు పీఎం కిసాన్‌తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14 వేలు ఇస్తామన్నారు. ఈ రూ.14 వేలు ప్రకారం గతేడాది ఇవ్వకుండా జిల్లా రైతులకు ఏకంగా రూ.400 కోట్లకు పైగా ఎగనామం పెట్టారు. ఖరీఫ్–2025 మొదలు కాకమునుపే మేలోనే ఇస్తామన్నారు. తర్వాత తేదీలు మారుస్తూ... ఎట్టకేలకు శనివారం సుఖీభవ కింద మొదటి విడతగా రూ.5 వేలు సొమ్ము వేస్తామని ప్రకటించారు.
లబ్ధిదారుల కుదింపు
గత వైఎస్సార్‌సీపీ హయాంలో 2,94,353 మందికి ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందించారు. ఇప్పుడు జాబితాలకు కొర్రీలు వేసి 2,75,049 మందికి కుదించారు. అంటే గతంలో కన్నా 19,304 మంది రైతులు జాబితాలో స్థానం కోల్పోయారు. వీరందరికీ సుఖీభవ దక్కే పరిస్థితి లేదు. సాధారణంగా ఏటా రైతుల సంఖ్య, భూమి పాస్‌పుస్తకాల సంఖ్య కొంతైనా పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన గత ప్రభుత్వంలో కన్నా కొందరు రైతులు పెరగాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా తగ్గించేయడం గమనార్హం. ఈ–కేవైసీ, ఎన్‌పీసీఐ లింక్ లేదంటూ కొందరు రైతులకు పెట్టుబడిసాయం దక్కే పరిస్థితి లేదు. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు చొప్పున రూ.55 కోట్లు, సుఖీభవ కింద రూ.5 వేల ప్రకారం రూ.137.53 కోట్లు... మొత్తంగా రూ.7 వేల ప్రకారం రూ.192.53 కోట్లు మేర పెట్టుబడిసాయం జమ కానుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రెండో విడత కింద రబీలో కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు, అలాగే మూడో విడత కింద జనవరి లేదా ఫిబ్రవరిలో కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం వాటాగా రూ.4 వేలు ప్రకారం జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంతో పోల్చితే మొదటి విడత కింద 19,304 మంది రైతులకు రూ.13.51 కోట్లకు పైగా సొమ్ము దక్కకుండా చేశారు.
గత ప్రభుత్వంలో 2,94,353 మందికి ‘రైతు భరోసా’ లబ్ధి
ఈసారి 2,75,049 మందికే ‘సుఖీభవ’ అంటున్న కూటమి ప్రభుత్వం