
నరకకూపాలుగా వసతిగృహాలు
● కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు
● వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు నరక కూపాలను తలపిస్తున్నాయని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ధ్వజమెత్తారు. వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్ ఎదుట ట్రంక్ పెట్టెలు, కంచాలతో ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఎ.రవిచంద్ర హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని మంత్రులు తమ పిల్లలను సంక్షేమ వసతిగృహాల్లో ఉంచి చదివిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్వహణను విస్మరించడంతో అధ్వానంగా మారాయని ధ్వజమెత్తారు. దోమ తెరలు, చాపలు, పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు విద్యార్థులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలన్నారు. పారిశుధ్యం లోపించి విద్యార్థులు ఆనారోగ్యంపాలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వసతిగృహాలకు ప్రహరీ లేకపోవడంతో ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణ కరువై అభద్రతతో ఉన్నారన్నారు. వసతిగృహాల నిర్వహణకు రూ.143 కోట్లు కేటాయించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు ప్రకటించారన్నారు. ఆ నిధులు విడుదల చేశారా..? చేసి ఉంటే ఎక్కడ ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా..? అంటూ నిలదీశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు 27 రకాల వస్తువులు ఇవ్వాల్సి ఉన్నా అమలు కాలేదన్నారు. అనంతరం డీఆర్‌ఓ మలోలను ఆయన చాంబర్‌లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాకు వైఎస్సార్‌సీపీ బీసీసెల్ అధ్యక్షుడు దేవేంద్ర హాజరై మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎండీ సుల్తాన్, వంశీయాదవ్, బీసీసెల్ రాష్ట్ర నాయకులు గోగుల పుల్లయ్య, విద్యార్థి విభాగం నియోజకవర్గాల అధ్యక్షులు కై లాష్, కాశీ, మనోజ్, సాకే పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు మంజూనాథ్‌రెడ్డి, వెంకట, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిశాంత్‌రెడ్డి, ఆశోక్, కార్యదర్శులు హరినాథరెడ్డి, మహేష్‌నాయక్, నగర నాయకులు అంజన్‌రెడ్డి, ఫయాజ్, రాహుల్‌రెడ్డి, రఫీ, తదితరులు పాల్గొన్నారు.

నరకకూపాలుగా వసతిగృహాలు