
‘జేఎన్‌టీయూ’ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీటెక్ నాల్గో సంవత్సరం రెండో సెమిస్టర్ అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ, ఎంబీఏ రెండో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్/సప్లి, ఎంబీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) సప్లి, ఎంసీఏ రెండో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్/సప్లి, ఎంసీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ, ఫార్మా డీ నాల్లో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–17) రెగ్యులర్/సప్లి ఫలితాలను గురువారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. ఫలితాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ మోసం
● అనంతలో పోలీస్ స్టేషన్ ఎదుట హిజ్రాలు, బాధితుల ధర్నా
అనంతపురం: నగరంలోని లెక్చరర్స్ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు. ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్‌బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు. దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.