
మఠం ఆస్తుల పరిరక్షణకు చర్యలు
ఉరవకొండ: కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న విలువైన గవిమఠం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి తెలిపారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో అన్యాక్రాంతమైన రూ.కోటి విలువైన భూమిని న్యాయపోరాటంతో సాధించుకున్నట్లు వివరించారు. గురువారం స్థానిక గవిమఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాధికారి మాట్లాడారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా దేవసముద్రం హోబళి కృష్ణరాజపురం గ్రామంలో సర్వే నంబర్ 39లో మఠానికి రూ.కోటి విలువ చేసే 10 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని సిద్దయ్య స్వామి అనే అర్చకుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. ఆయన మృతి అనంతరం అతని భార్య రుద్రమ్మ మఠం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో విషయం తెలిసి ఈ ఏడాది జూలై 16న చిత్రదుర్గ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం మఠానికి చెందిన భూమిని అర్చకుల పేరు మీద చేసేందుకు హక్కులేదని, వాటిని అర్చకులు అనుభవించేందుకు మాత్రమే వీలుందని న్యాయస్థానం వెల్లడి చేసిందన్నారు. రికార్డుల్లో పేర్లు మార్చడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను కోర్టు మందలించిందన్నారు. దీంతో ఆ భూమికి సంబంధించి హక్కులు గవి మఠానికి కల్పిస్తూ ఆన్‌లైన్ రికార్డుల్లో పొందుపరిచారన్నారు.
ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి