అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌ఏపీఈ) రాష్ట్ర అధ్యక్షుడిగా శింగనమల మండలం పెరవలిలోని జెడ్పీహెచ్‌ఎస్ పీడీ కూరపాటి నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. గురువారం విజయవాడలో ఏపీఎస్‌ఏపీఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉద్యోగ విరమణ రోజే మృతి
గుంతకల్లు రూరల్: వైద్య, ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీరస్‌గా పనిచేస్తున్న వసుంధర గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం పత్తికొండ మండలం పుచ్చకాలమాడ పీహెచ్‌సీలో పనిచేస్తున్నారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆమె ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వసుంధర.. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించి వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కన్ను మూశారు.
తాగుడుకు డబ్బు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
రాప్తాడు రూరల్: తాగుడుకు డబ్బు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ సోములదొడ్డి పంచాయతీ పావురాలగుట్ట కాలనీలో నివాముంటున్న షాజహాన్ (45), గౌషియా దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో షాజహాన్ కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. పనీపాట చేయకుండా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ మద్యం తాగుతూ జులాయిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ తరచూ భార్యను వేధించేవాడు. గురువారం మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని అడగడంతో గౌషియా లేవని చెప్పింది. దీంతో క్షణికావేశానికి లోనైన షాజహాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గౌషియా ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగలింగారెడ్డి (57) చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లిలో గురువారం జరిగిన అల్లుడి కర్మకాండలో పాల్గొంనేందుకు భార్య సుధారాణితో కలసి వచ్చాడు. ఈ క్రమంలో కర్మ కాండలు పూర్తయిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని వస్తానంటూ భార్యతో చెప్పి గ్రామ సమీపంలోని పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొంది. ప్రమాదంలో శరీరం ఛిద్రమై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హిందూపురం జీఆర్పీ ఎస్‌ఐ సజ్జప్ప అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

ఏపీఎస్‌ఏపీఈ రాష్ట్ర అధ్యక్షుడిగా కూరపాటి