
రాప్తాడులో రెచ్చిపోయిన దొంగలు
రాప్తాడు: మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ సమీపంలో బీసీ కాలనీలో నివాసముంటున్న బాధితుడు చిరుతల ఇటుకు నల్లప్ప తెలిపిన మేరకు.. రాప్తాడుకు చెందిన చిరుతల ఈశ్వరయ్య కుమారుడు గణేష్, అడ్ర వెంకటేశులు కుమారై సరిత వివాహం ఈ నెల 30న రాప్తాడులోని లక్ష్మీపండమేటి వేంకటరమణస్వామి ఆలయంలో జరిగింది. వివాహనికి బంధువైన ఇటుకు నల్లప్ప, తన భార్య శ్రీదేవితో కలసి వెళ్లాడు. వధూవరులిద్దరూ రాప్తాడుకు చెందిన వారు కావడంతో ఇరువైపులా కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి మెరిమణి నిర్వహించారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి మెరవణిలో నల్లప్ప దంపతులు పాల్గొన్నారు. విషయాన్ని గుర్తించిన దుండగులు తలుపులు ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించి బీరువాలోని ఏడున్నర తులం బరువున్న బంగారు నగలు, రూ.60వేల సొంత నగదు, ఇటుకుల పల్లయ్య స్వామి ఆలయానికి చెందిన రూ.85వేలు, మోటార్ మెకానిక్‌గా ఉన్న కుమారుడు శివయ్య బెంగళూరులో సామగ్రి కొనుగోలు చేసేందుకు ఇతరుల నుంచి అప్పుగా తెచ్చిన రూ.4.20 లక్షలను అపహరించారు. రాత్రి 11 గంటలకు మెరవణి పూర్తి కావడంతో 12 గంటలకు ఇంటికెళ్లిన దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీహర్ష, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
రూ.5.65 లక్షల నగదు చోరీ
ఏడున్నర తులాల బంగారు నగలూ అపహరణ