పూలే విగ్రహావిష్కరణ

- - Sakshi

తాడిపత్రి టౌన్‌: స్థానిక కూరగాయల మార్కెట్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరావు సోమవారం ఆవిష్కరించారు. వారి వెంట ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రాష్ట్ర కార్యదర్శులు రమేష్‌రెడ్డి, పేరం స్వర్ణలత, డీసీసీబీ చైర్‌పర్సన్‌ ఎం.లిఖిత, మాజీ చైర్మన్‌ పామిడి వీరా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, రాజారాం, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సైపుల్లాబేగం ఉన్నారు.

‘ఆడుదాం ఆంధ్ర’

విజయవంతం కావాలి

అనంతపురం అర్బన్‌: జిల్లాలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి పిలుపునిచ్చారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌, మస్కట్‌ లోగోను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన యువతను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి అలవాట్లు, పోటీతత్వం అలవర్చాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గం, రాష్ట్రస్థాయిలో డిసెంబరు 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకూ పోటీలు జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సచివాలయాలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అందజేస్తుందన్నారు. మైదానాలు, స్టేడియాలు సంసిద్ధం చేస్తారన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో 10 మంది స్పోర్ట్స్‌ వలంటీర్లను ఎంపిక చేసి నిబంధనలపై శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

రిజిస్ట్రేషన్‌ ఇలా...

బాలబాలికలు తమ సమీపంలోని సచివాలయంలో నమోదు చేసుకోవచ్చని జిల్లా స్పోర్ట్స్‌ కార్యాలయం డీఎస్‌డీఓ నరసింహారెడ్డి తెలిపారు. aadudamandhra. ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా 1902 నంబర్‌కు కాల్‌ చేసి కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు.

స్కాన్‌ సెంటర్‌ నిర్వాహకులపై పిటిషన్‌

అనంతపురం మెడికల్‌: అనధికారికంగా స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించిన సునీల్‌కుమార్‌, శ్రావణిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ భ్రమరాంబ దేవి సోమవారం నగరంలోని ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు (సీఎఫ్‌ నెంబర్‌ 2019/2023) చేశారు. వివరాలు.. అనంతపురానికి చెందిన సునీల్‌ కుమార్‌ నగరంలోని ఎర్రనేల కొట్టాలలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫార్మసిస్ట్‌ శ్రావణితో కలసి అనధికారికంగా స్కానింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. విద్యార్హత లేకున్నా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడసాగారు. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 21న దాడులు నిర్వహించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి, తహసీల్దార్‌ బాలకృష్ణ, అనంతపురం మూడో పట్టణ పోలీసులు గుట్టు రట్టు చేశారు. కొన్ని నెలలుగా గర్భిణులతో రూ.లక్షలు తీసుకుని 128 స్కాన్‌లు చేసినట్లు గుర్తించారు. స్కాన్‌ సెంటర్‌ను సీజ్‌ చేశారు. ఈ క్రమంలో నిందితులపై తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో డీఎంహెచ్‌ఓ పిటీషన్‌ దాఖలు చేశారు.

ఘనంగా పల్లకీ సేవ

నార్పల: గూగూడులో కుళ్లాయిస్వామి పల్లకీ సేవ సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సర్పంచు రమణ కుమారి, ఎంపీటీసీ రాజారెడ్డి, కో–ఆప్షన్‌ షాబీరా పూజలు చేసి ప్రారంభించారు. మంగళవారం ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, హనుమాన్‌ చాలీసా పారాయణం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈఓ శోభా, ఆలయ కమిటీ చైర్మన్‌ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top