‘చంద్రయాన్‌–3’ ఓ అద్భుతం | Sakshi
Sakshi News home page

‘చంద్రయాన్‌–3’ ఓ అద్భుతం

Published Fri, Sep 22 2023 12:24 AM

- - Sakshi

అనంతపురం: ‘చంద్రయాన్‌–3 ప్రయోగంతో మనందరమూ ఓ అద్భుతాన్ని చూశాం. యావత్‌ ప్రపంచం గర్వించేలా చంద్రయాన్‌–3 విజయం సాధించింది. ఇది నవభారత విజయం. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉంది’ అని జేఎన్‌టీయూ (ఏ) ఈసీఈ విభాగం పూర్వ విద్యార్థి (చంద్రయాన్‌ –3 ప్రాజెక్ట్‌లోని ఓ శాస్త్రవేత్త ) డాక్టర్‌ ఎ. సాయి చందన అన్నారు.

ప్రస్తుతం బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌ ‘సీ’గా పనిచేస్తున్న ఆమెను జేఎన్‌టీయూ(ఏ)లో గురువారం ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఈ.అరుణకాంతి, డాక్టర్‌ జి.మమత, డాక్టర్‌ డి.విష్ణువర్ధన్‌, ఈసీఈ విభాగాధిపతి ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, సీనియర్‌ ప్రొఫెసర్లు పి.రమణారెడ్డి, వి.సుమలత, అరుణ, మస్తానీ, లలితకుమారి, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం చంద్రయాన్‌–3 మిషన్‌లో ఇంజినీర్ల పాత్రను ఆమె వివరించారు.

కీలక పాత్ర మాదే
భూమి నుంచి చంద్రుని పైకి ఉపగ్రహం వెళ్లే మధ్యలో జరిగే నావిగేషన్‌ ప్రక్రియ మొదలు ల్యాండింగ్‌ అయ్యే వరకూ తమ బృందంలోని 30 మంది బాధ్యత వహించారన్నారు. ముందుగా తాము పరిశీలించిన తర్వాతనే ల్యాండర్‌కు ఎలాంటి సందేశమైనా పంపాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినప్పుడు విజయవంతం చేసేందుకు దాదాపు వెయ్యి పర్యాయాలు సిమ్ములేషన్‌ చేశామన్నారు. చంద్రయాన్‌–3 విజయంలో కీలక పాత్ర పోషించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

నీటి జాడలున్నాయనే..
చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడలు ఉన్నాయని భావించడం వల్లనే రోవర్‌ను అక్కడ దింపినట్లు పేర్కొన్నారు. రాళ్లు, శిలలు తక్కువగా ఉండడంతో ల్యాండర్‌ సురక్షితంగా దిగేందుకు మార్గం సుగమమైందన్నారు. ఆ ప్రాంతంలో మంచు స్పటికాల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని ఇస్రో గుర్తించిందన్నారు. అందులోనూ దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుందన్నారు. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో ఉంటాయన్నారు. ఈ కారణాల రీత్యా అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఇస్రో అంచనా మేరకు పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చునన్నారు. నీరుంటే అక్కడ మానవ మనుగడ కూడా సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

నానో శాటిలైట్లదే భవిష్యత్తు
చంద్రయాన్‌–3 విజయవంతం చేయడంలో భారత శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని డాక్టర్‌ సాయిచందన కొనియాడారు. ఈ విజయం ద్వారా అంతరిక్ష పరిశోధనలకు 50 దేశాలు ఇస్రోతో ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. భవిష్యత్తు నానో శాటిలైట్‌లదే అవుతుందన్నారు. నానో శాటిలైట్‌ విప్లవానికి ఇస్రో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.

Advertisement
Advertisement