నవంబర్ 1న పోలింగ్.. 3న ఓట్ల లెక్కింపు
యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా
తుమ్మపాల : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనున్న నేపథ్యంలో, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నామినేషన్ల దాఖలుకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం.08924–222888కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. శుక్రవారం అనకాపల్లి మండలం కొత్తూరులోని ఎ.ఎం.ఏ ఆదినారాయణ ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ నిర్వహించారు. ఎన్నికల నియమావళి, ఓటర్ల గుర్తింపు, బ్యాలెట్ పత్రాల జారీ, బ్యాలెట్ బాక్సుల సీలింగ్, టెండర్డ్, ఛాలెంజ్డ్ ఓట్ల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. దివ్యాంగ ఓటర్లకు సహాయం చేసే విధానాలను వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలని సూచించారు. అంతకుముందు స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌరమార్యమాన్ పటేల్, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ నరసింహరావు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయని, తొలుత ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించగా, ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఎన్నికల తేదీలను సవరించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే నవంబర్ 2న రీపోలింగ్ చేపడతామని వెల్లడించారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌కు అనుగుణంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.


