రాంబిల్లి : లాలంకోడూరు పంచాయతీలో జనసేనకు షాక్ తగిలింది. తాజా మాజీ సర్పంచ్ రుత్తల గుణాకర్, ఆయన భార్య సంధ్య జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాంబిల్లిలో శుక్రవారం యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు(కన్నబాబు రాజు) సమక్షంలో గుణాకర్ , సంధ్య దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు. సంధ్య లాలంకోడూరు ఎంపీటీసీ స్ధానానికి వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్ వేశారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని అలాగే ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంటామని గుణాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పిన్నంరాజు కిషోర్‌రాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు జి.వి.వి.రమణమూర్తిరాజు(శ్రీనుబాబు), రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ధూళి నాగరాజు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మునగపాక : జనసేనకు షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి భాగస్వాములైన జనసేనకు చెందిన మండల నాయకుడు అల్లవరపు రమణబాబు శుక్రవారం పార్టీకి, సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. మండలంలోని పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన రమణబాబు 2023 నుంచి జనసేనలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చాడు. కాపులకు న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే విజయకుమార్ ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో పాటు పార్టీలో కష్టపడి పనిచేసే వారిని కాకుండా పార్టీని భ్రష్టు పట్టించేవారికి అందలం ఎక్కించడాన్ని నిరసిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.


