సమన్వయం లేదు.. సొంత దారే..! | - | Sakshi
Sakshi News home page

సమన్వయం లేదు.. సొంత దారే..!

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమన్వయం మాటలకే పరిమితం.. సీట్ల దగ్గర సిగపట్లు! జీవీఎంసీ ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం చిచ్చు పెడుతోంది. విశాఖ మేయర్‌ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతుండగా.. కార్పొరేటర్‌ స్థానాల కేటాయింపుపై జనసేన గుర్రుగా ఉంది. తమకు కావాల్సినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్న ఆ పార్టీ.. సమన్వయ కమిటీ సమావేశాలకు దూరంగా ఉండటమే కాకుండా, మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. నర్సీపట్నం, యలమంచిలిలో చోటుచేసుకున్న పరిణామాలు కూటమిలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల కేటాయింపే మిత్రపక్షాల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. జనసేనకు 24 సీట్లకు మించి కేటాయిస్తే గెలుపు అవకాశాలు తగ్గుతాయంటూ ఎంపీ భరత్‌ వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. తమకు 40 కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించాల్సిందేనని జనసేన పట్టుబడుతోంది. దీంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం పీటముడిలా మారింది. గురువారం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో భరత్‌ వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే ఒకరు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆగ్రహంతో చేతిలోని కాగితాలను విసిరికొట్టారన్న చర్చ కూడా వినిపిస్తోంది. అనంతరం సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయి జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో విడిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సమావేశాలకు డుమ్మా.. మంత్రితో భేటీ

సీట్ల పంపకంపై చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిన జనసేన నేతలు సమన్వయ కమిటీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఉదయం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి బీజేపీ తరఫున ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరయ్యారు. టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, ఇన్‌చార్జి మంత్రి డోలా, మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. అయితే, జనసేన నుంచి ఎవరూ హాజరుకాలేదు. సాయంత్రం నిర్వహించిన మరో సమావేశానికీ ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు. మరోవైపు, దసపల్లా హోటల్‌లో బస చేసిన ఇన్‌చార్జి మంత్రి డోలాతో జనసేన నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. విశాఖ దక్షిణ, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల్లో తమ పార్టీకి అధిక స్థానాలు కేటాయించాలని జనసేన ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇతర నియోజకవర్గాల్లో మాత్రం అంతగా పట్టించుకోకుండా ముందుకెళ్లాలనే ధోరణి కనిపిస్తోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

నర్సీపట్నంలో

సమన్వయ కమిటీ సభ్యురాలే రెబల్‌

నర్సీపట్నం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఈ స్థానం నుంచి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సతీమణి పోటీలో నిలవనున్నట్లు ప్రకటించారు. అయినా జనసేన తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఎన్నికల జిల్లా సమన్వయ కమిటీ సభ్యురాలిగా ఉన్న జనసేన నేత అద్దెపల్లి సౌజన్య నామినేషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును సమన్వయం చేయాల్సిన కమిటీలో సభ్యురాలిగా ఉన్న నేతే.. మిత్రపక్షానికి కేటాయించిన స్థానంలో పోటీకి దిగడం గమనార్హం. నర్సీపట్నంలోని అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధమన్న సంకేతాలు జనసేన నుంచి వెలువడుతుండటంతో స్థానికంగా రాజకీయ వేడి పెరుగుతోంది.

యలమంచిలిలోనూ అదే తీరు

యలమంచిలిలోనూ మిత్రపక్షాల మధ్య సీట్ల పంచాయితీ రచ్చకెక్కుతోంది. యలమంచిలి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా.. ఆ పార్టీ తరఫున పిళ్లా రమణకుమారి పోటీలో ఉంటారని ప్రకటించారు. అయితే జనసేన తరఫున కర్రి ఝాన్సీని కూడా స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ బరిలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. మిత్రపక్షానికి కేటాయించిన స్థానంలో మరో పార్టీ అభ్యర్థి పోటీకి దిగడం కూటమి నిర్ణయాల అమలుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

భరత్‌ వ్యాఖ్యలతో సొంత పార్టీలోనూ అసమ్మతి

విశాఖ మేయర్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఎంపీ భరత్‌ వ్యవహారశైలిపై టీడీపీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్‌ అభ్యర్థి ఎంపిక నుంచి కార్పొరేటర్‌ సీట్ల పంపకం వరకు కీలక నిర్ణయాలపై ఆయన వైఖరి చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు అదే వ్యవహారం మిత్రపక్షమైన జనసేనలోనూ అసహనాన్ని పెంచినట్లు తెలుస్తోంది. 120 వార్డులున్న జీవీఎంసీలో జనసేనకు 24 స్థానాలే సరిపోతాయన్న వాదన ఒకవైపు.. తమకు 40 సీట్లు కావాలన్న డిమాండ్‌ మరోవైపు.. కూటమిలో సీట్ల పంపకం ఎంతటి సంక్లిష్టంగా మారిందో స్పష్టం చేస్తున్నాయి.

మిత్రపక్షాల మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ

సమన్వయ కమిటీ సమావేశాలకు జనసేన డుమ్మా

40 సీట్ల కోసం పట్టు.. మిత్రపక్షాల స్థానాల్లోనూ పోటీ

నర్సీపట్నం, యలమంచిలిలో జనసేన రెబల్స్‌

ఎంపీ భరత్‌ వ్యాఖ్యలపై జనసేనలో అసంతృప్తి..

మేయర్‌ అభ్యర్థి ఎంపికపైనా టీడీపీలో అసమ్మతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement