అనకాపల్లి : జీవీఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. పట్టణంలో జీవీఎంసీ వేల్పులవీధి బాలికోన్నత పాఠశాల, గవరపాలెం సంతబయలు(హైపర్ సెన్సిటివ్) పోలింగ్ కేంద్రాలు, రావుగోపాలరావు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బ్యాలెట్ బాక్స్లను శుక్రవారం ఆయన జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రతపై అధికారులతో చర్చించి, అవసరమైన పటిష్ట చర్యలను సమీక్షిస్తామన్నారు. ఎన్నికల విధులకు వచ్చే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి.వి.వి.నరసింహరావు, పట్టణ సీఐ జీ.ప్రేమ్కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


