పెట్టుబడుల మోసం.. ప్రచారార్భాటం! | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల మోసం.. ప్రచారార్భాటం!

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

మళ్లీ పార్టనర్‌షిప్‌, ప్రాంతీయ సదస్సులంటూ హడావుడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రీజనల్‌ సమ్మిట్‌కే రూ.2 కోట్ల వ్యయం విశాఖ జిల్లా ఖజానా నుంచి ఇప్పటికే రూ.250 కోట్లు స్వాహా వచ్చేది రూ.100.. పోయేది రూ.150 అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం విశాఖ అభివృద్ధికి అర్థ రూపాయి కూడా ఖర్చు చేయని వైనం

సాక్షి, విశాఖపట్నం:

‘నమస్తే.. నేను మీ విశాఖపట్నాన్ని!

ఈ మధ్య టీవీల్లో, పత్రికల్లో చంద్రబాబు, లోకేష్‌ల మాటల గారడీ చూసి మీరంతా మురిసిపోతుంటారు. విశాఖలో రోజూ పండుగేనని, వీఐపీల హడావుడితో, అంతర్జాతీయ సదస్సులతో నగరం వెలిగిపోతోందని అనుకుంటున్నారు. కానీ, ఆ కాంతుల కింద నా చీకటి బతుకుని.. పరిచిన రెడ్‌ కార్పెట్‌ కింద నా కన్నీళ్లను ఎవరూ చూడటం లేదు. నిజం చెప్పాలంటే.. నాకిప్పుడు శ్వాస ఆడటం లేదు, ఆత్మ బరువెక్కిపోతోంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. భవిష్యత్తులో జరగబోయే భారీ సదస్సుకు ముందస్తుగా, బుధవారం గంభీరంలోని ఐఐఎంలో ‘రీజనల్‌ సమ్మిట్‌’ పేరుతో ఓ హడావిడి కార్యక్రమం నిర్వహించారు. మంత్రుల ఊకదంపుడు ఉపన్యాసాలు, కాగితాలకే పరిమితమైన రూ.కోట్ల ఒప్పందాలతో గొప్పలు చెప్పుకున్నారు. అందుకే నా వేదనను మీతో పంచుకుంటున్నాను.

నిన్నటి ఆశ.. నేటి నిరాశ!

2024 వరకు నాలో ఒక ఆశ ఉండేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నన్ను ‘ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌’గా ప్రకటించింది. మాటలకే పరిమితం కాకుండా రోడ్లు వెడల్పు చేసింది, జంక్షన్లను సుందరీకరించింది. విశాఖ ప్రజల కోసం అడుగడుగునా వార్డు సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. ‘బీచ్‌ ఐటీ’ కాన్సెప్ట్‌తో ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ సంస్థ నగరానికి వచ్చింది.

దీంతో నా దశ నిజంగానే మారుతోందని, ఇక తిరుగుండదని భావించాను. కానీ, ప్రభుత్వం మారగానే మళ్లీ 1996 నాటి పాత క్యాసెట్‌ మొదలైంది. ‘విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం’ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. 2014–19 లోనూ నన్ను జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు ఒక ‘ఫంక్షన్‌ హాల్‌’లా, ‘షూటింగ్‌ స్పాట్‌’లా వాడుకున్నారు.

ఇప్పుడు మళ్లీ అదే నాటకంతో ముందుకు వచ్చారు. మాటల్లో ఆకాశాన్ని చూపిస్తూ.. ఆచరణలో పాతాళానికి తొక్కేస్తున్నారు. నిన్నగాక మొన్న బీచ్‌రోడ్డులో ‘మురీ మిక్చర్‌’ తింటూ చంద్రబాబు ఎంత బాగా నటించారో చూశారు కదా! గడిచిన రెండేళ్లుగా నా పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది.

ఇంట్లో వాళ్ల కడుపు కొట్టి.. ఊరి వాళ్లకు విందు!

నా ప్రజలు ఎంతో కష్టపడి ఆస్తి, నీటి, వర్తక పన్నుల రూపంలో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏల చేతుల్లో డబ్బులు పెడతారు. ఆ నిధులతో డ్రైనేజీలు బాగుచేయాలి, రోడ్ల గుంతలు పూర్చాలి, వీధి దీపాలు వెలిగించాలి.

కానీ ఈ ప్రచారార్భాట ప్రభుత్వం.. ప్రజలకు ఖర్చు చేయాల్సిన సొమ్మును లాక్కొని, సదస్సుల పేరుతో వీఐపీల విమాన ప్రయాణాలకు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల బసకు, అలంకరణలకు నీళ్లలా ఖర్చు చేస్తోంది.

నా జేబుకు పడుతున్న చిల్లుల చిట్టా

జిల్లా ఖజానా నుంచి ఇప్పటికే సుమారు రూ.250 కోట్లు కేవలం ఈ సదస్సుల హడావుడికే ఆవిరైపోయాయి. బుధవారం జరిగిన ఒక్క రీజనల్‌ సదస్సుకే ఏకంగా రూ.2 కోట్లు వదిలించేశారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి.

యోగాంధ్ర ఉత్సవం: ఈ ఈవెంట్‌ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం జీవీఎంసీ రూ.10 కోట్లు, వీఎంఆర్‌డీఏ రూ.12 కోట్లు అప్పు చేసి మరీ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటా సొమ్మును రాష్ట్ర ఖజానాకు పంపినా, చంద్రబాబు ప్రభుత్వం నాకు తిరిగి ఇవ్వలేదు. ఏడాదిన్నర గడుస్తున్నా ఆ డబ్బుల ఊసే లేదు సరేకదా, పైగా ఇంకా రూ.40 కోట్లు బకాయిలు పెట్టింది.

భాగస్వామ్య సదస్సు : 2025 సీఐఐ సదస్సు కోసం రూ.77 కోట్లు ఖర్చయింది. ప్రోటోకాల్‌ కోసం రెవెన్యూ శాఖ రూ.7 కోట్లు, సుందరీకరణ కోసం జీవీఎంసీ రూ.60 కోట్లు, వీఎంఆర్‌డీఏ రూ.10 కోట్లు భరించాయి. ఆ రూ.60 కోట్లు నా మౌలిక వసతులకు ఇచ్చి ఉంటే రూపురేఖలు మారిపోయేవి. కానీ రూపాయి కూడా తిరిగి రాలేదు.

ఇతర సదస్సులు: ఎంఎస్‌ఎంఈ, క్లీన్‌ ఎనర్జీ, విశాఖ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అంటూ జరిపిన అనేక సదస్సులకు మరో రూ.100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేశారు. సదస్సుల వల్ల వచ్చే పెట్టుబడులు రూ.100 అయితే, ఖజానా నుంచి పోయేది రూ.150. ఈ ప్రచారార్భాటం వల్ల నా భవిష్యత్తు అప్పుల కుప్పగా మారుతోంది.

ఇదీ అసలు కథ!

పెట్టుబడుల పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లకు వందల కోట్లు ధారపోస్తున్నారు. కానీ, నగరంలో రోడ్లు బాలేవు, డ్రైనేజీలు పొంగుతున్నాయి.. ఒక రూ.10 కోట్లు ఇవ్వండని అధికారులు అడిగితే పట్టించుకోవడం లేదు. బిల్లులు ఇవ్వాలంటూ జీవీఎంసీ కాంట్రాక్టర్లు, జీతాల కోసం సచివాలయ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కానీ, ఈవెంట్ల మేకప్‌తో విశాఖను ఓహో అని పొగిడేందుకు సోషల్‌ మీడియా టీమ్‌లను ఏర్పాటు చేసి, డప్పు కొట్టిస్తూ రీల్స్‌ గోల చేస్తున్నారు. ఆ రీల్స్‌ చూసి మోసపోకండి.. లోపల కదిలిపోతున్న నా పునాదుల దుస్థితిని చూడండి. సంపద సృష్టించడంలో ఎక్స్‌పర్ట్‌ అని చెప్పుకునే చంద్రబాబు.. ఉన్న సంపదనంతా తన ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారు. విశ్వనగరంగా వెలగాల్సిన నన్ను ‘ఉత్తుత్తి నగరం’గా మార్చేస్తున్నారు. చంద్రబాబుకు పట్టిన ఈ ప్రచార యావ ఎప్పుడు తగ్గుతుందో.. అప్పుడే నాతో పాటు ఈ రాష్ట్రం బాగుపడుతుంది.

ఇక సెలవు.

ఇట్లు,

చంద్రబాబు సదస్సుల సాగర నగరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement