చేనేత సొసైటీ అక్రమాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

చేనేత సొసైటీ అక్రమాలపై విచారణ

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

● రూ.1.65 కోట్లు దుర్వినియోగంపై ఫిర్యాదులు ● మేనేజర్‌ సస్పెండ్‌ ● సొసైటీ కార్యాలయం స్వాధీనం

పాయకరావుపేట : స్థానిక చేనేత కార్మికుల సహకార సంఘంలో నేతన్న సేవా పథకం అమలులో అక్రమాలు జరిగాయని అందిన ఫిర్యాదు మేరకు చేనేత జౌళి శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు రుజువు కావడంతో సంఘ మేనేజర్‌ గోరు వీర నాగేశ్వరరావును సస్పెండ్‌ చేయడంతో పాటు బుధవారం కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విచారణ అధికారి యశ్వంత్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే పాయకరావుపేట పట్టణంలో చేనేత సహకారం సంఘం ఉంది. నేతన్న సేవా పథకం కింద నేతన్నలకు మంజూరు చేసిన పథకాలను మేనేజర్‌ వీర నాగేశ్వరరావు పక్కదారి పట్టించాడు. బంధువులకు, తనకు కావాల్సిన వారికి పథకాలను వర్తింపజేసే విధంగా వ్యవహరించాడు. చేనేత సహకార సంఘానికి చెందిన కమ్యూనిటీ హాలును ఫంక్షన్‌ హాల్‌గా మార్చి డైనింగ్‌ షెడ్డును, ప్రింటింగ్‌ ప్రెస్‌ను, అద్దెకు ఇచ్చి వాటి ద్వారా పదేళ్ల నుంచి వచ్చిన సుమారు రూ.1.65 కోట్లు స్వాహా చేశాడని, సంఘ సభ్యులు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. బుధవారం మేనేజర్‌ నాగేశ్వరరావును సస్పెండ్‌ చేయడంతో పాటు, సంఘ కార్యాలయ భవనాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వరరావు అద్దెకు ఇచ్చిన ఫంక్షన్‌ హాలు, డైనింగ్‌హాలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లను కూడా స్వాధీనం చేసుకుని తాళాలు వేశారు. సంఘంలో ఉన్న కార్మికులు, సభ్యులంతా కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, కొత్త మేనేజర్‌ను నియమించడం జరుగుతుందని, కమిటీ వారి సమక్షంలో తిరిగి కార్యాలయాన్ని అప్పగించడంతో పాటు సంఘానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని ఈ సందర్భంగా ఏడీ యశ్వంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement