జైలు శిక్ష కాదు.. మార్పునకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

జైలు శిక్ష కాదు.. మార్పునకు అవకాశం

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

ఆరిలోవ: క్షణికావేశంలో తప్పులు చేసి పలువురు జైలుకు వస్తున్నారని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి జి. శ్రీనివాస్‌ అన్నారు. కేంద్ర కారాగారంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌, జైలు సూపరింటిండెంట్‌ బి. చంద్రశేఖర్‌ తదితరులతో కలిసి గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖైదీల కోసం జైలు అధికారులు ముందుగా నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి న్యాయమూర్తి, కలెక్టర్‌ బహుమతులు అందజేశారు.ఇటీవల జైలులో నిర్వహించిన ఆఫీస్‌ అసిస్టెంట్‌ కోర్సు పూర్తి చేసిన ఖైదీలకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం న్యాయమూర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు, అనుకోని సంఘటనల కారణంగా చాలామంది తప్పులు చేస్తున్నారని అన్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలాన్ని శిక్షణ కాలంగా భావించాలని సూచించారు. విడుదలైన తర్వాత తిరిగి తప్పులు చేయకుండా మంచి పౌరులుగా సమాజంలో జీవించాలని ఆకాంక్షించారు.కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ.. జైలులో పరిశ్రమలు నిర్వహించి ఖైదీలతోనే పనులు చేయించడం మంచి పరిణామమన్నారు. దీనివల్ల వారికి ఉపాధి లభించడంతో పాటు ప్రవర్తనలోనూ మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఆర్‌. సన్యాసినాయుడు, జైలు డిప్యూటీ సూపరింటిండెంట్‌ సూర్యకుమార్‌, ద్వారకా ఏసీపీ మల్లేశ్వరరావు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement