నర్సీపట్నం: నర్సీపట్నం మండలం గురంధరపాలెం గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. రూరల్ ఎస్‌ఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేరకుం యనమిరెడ్డి చరణ్ శ్రీనివాస్‌రెడ్డి పట్టణంలోని నలంద పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు ఉండడంతో తోటి విద్యార్థులతో కలిసి జగనన్న కాలనీ సమీపంలోని లక్ష్మమ్మ చెరువు వద్ద ఉన్న మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆటలో భాగంగా బంతి చెరువులో పడడంతో దానిని తీసేందుకు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు చెరువు వద్దకు పరుగులు తీశారు. ఎస్‌ఐ రామారావు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చేపట్టి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. కాసేపటి క్రితమే స్నేహితులతో ఆటలో మునిగిపోయిన బాలుడు రెప్పపాటులో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల రోదనలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


