అనకాపల్లి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా, వైద్యుల నిర్లక్ష్యంతో తమ ఏడాది పసికందును కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి క్రిటికల్ విభాగంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోట మండలం తేగాడ గ్రామానికి చెందిన నానుబిల్లి పరమేష్, సుగుణ దంపతుల ద్వితీయ కుమార్తెకు జలుబు, కొద్దిగా ఆయాసం రావడంతో గత నెల 29న ఆస్పత్రికి తీసుకురాగా ట్రీట్‌మెంట్ చేసి మందులు ఇచ్చి పంపించేశారు. ఈనెల 1న ఉదయం మళ్లీ తీసుకువచ్చారు. ఫరవాలేదు. మందులు వాడండి అని పంపిచేశారు. మళ్లీ గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో చిన్నారికి ఊపిరి సమస్య ఎక్కువ అవడంతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన వెంటనే సకాలంలో సిబ్బంది స్పందించక, వైద్యం అందక, చిన్నారికి ఉన్న అసలు సమస్యను స్పష్టంగా చెప్పక తమ పాప మృతి చెందిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాపకు ఆక్సిజన్ పెట్టాలని తీసుకు వెళుతుండగా, పరిస్థితి విషమించిన అనంతరం పాప మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రెండు రోజులుగా వైద్యం కోసం తిరిగినా పాప ఆరోగ్య పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వలేదని, ఆస్పత్రి ఆవరణలో గ్రామానికి చెందిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పాప మరణానికి కారకులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని, వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పాప తండ్రి ఆటో డైవర్ కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరికి ప్రథమ సంతానం నాలుగేళ్ల పాప చరణి ఉంది. రెండో సంతానంగా పుట్టిన పాపకు 15 రోజుల క్రితమే పుట్టిన రోజు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్‌ను వివరణ కోరగా విచారణ జరిపి సంబంధిత వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.


