కె.కోటపాడు: చౌడువాడ శారదానదిలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు గురువారం కొరడా ఝుళిపించారు. సాక్షిలో గత నెల 29న ప్రచురితమైన ‘మళ్లీ మొదలైన ఇసుక అక్రమ రవాణా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన తహసీల్దార్ బి.నాగరాజు, గ్రామ రెవెన్యూ అధికారి బండారు నాయుడు కలిసి శారదానది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న స్థావరాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వీటి యజమానులపై కేసును నమోదు చేయడంతో పాటు అపరాధరుసుం విధించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ దాడుల్లో వీఆర్‌ఏలు కెల్లి అంజి, ఈశ్వరమ్మ, హరికృష్ణ పాల్గొన్నారు.


