సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛ ఆంధ్ర–2026 పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఉమ్మడి విశాఖకు పలు కేటగిరీల్లో పురస్కారాలు దక్కాయి. స్వచ్ఛ బస్ స్టేషన్ కేగిరీలో ద్వారకా బస్ స్టేషన్, స్వచ్ఛ టూరిస్ట్–హెరిటేజ్ ప్రదేశాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు పైనరీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ(జీవీఎంసీ) మూడు కేటగిరీల్లో పురస్కారాలు దక్కించుకుంది. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయ కేటగిరీలో ద్వితీయ స్థానం, స్వచ్ఛ మున్సిపాలిటీలు(3 లక్షలు అంతకు మించిన జనాభా) కేటగిరీలో తృతీయ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ వారియర్స్‌లో జీవీఎంసీ వెస్ట్ జోన్‌కు చెందిన వై.నాగరాజు తృతీయస్థానంలో నిలిచి పురస్కారం దక్కించుకున్నారు. స్వచ్ఛ స్కూళ్ల కేటగిరీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(చంద్రంపాలెం), స్వచ్ఛ గ్రామ పంచాయతీల్లో అనకాపల్లి జిల్లా మార్టూరు, స్వచ్ఛ ఆస్పత్రుల్లో జీఏడీ అనకాపల్లి, సీహెచ్‌సీ పెందుర్తి, యూపీహెచ్‌సీ చినముషిడివాడ, స్వచ్ఛ హాస్టళ్లలో అనకాపల్లి జిల్లా తాండవలోని జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల(బాలికలు), స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్‌లో విశాఖలోని చిన్నాపురం విలేజ్ ఆర్గనైజేషన్(ద్వితీయ), స్వచ్ఛ దేవాలయాలు, మత సంబంధిత ఇనిస్టిట్యూషన్స్‌లో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(తృతీయ) పురస్కారం దక్కించుకున్నాయి. స్వచ్ఛ హోటళ్లలో నోవోటెల్ విశాఖపట్నం వరుణ్‌బీచ్ మాత్రమే పురస్కారం పొందింది. వీరికి ఈ నెల 2న విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పురస్కారాలు అందించనున్నారు.


