ఖాళీ బిందెల గోడు వినండి... | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెల గోడు వినండి...

Aug 27 2026 12:24 AM | Updated on Aug 27 2026 12:24 AM

రోలుగుంట: ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రోలుగుంట ఎస్సీ కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు సారధ్యం వహించిన సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ మండలంలోని కె.నాయుడుపాలెం, నిండుగొండ, ఎన్‌.కొత్తూరు తదితర ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీరందక జనం ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆయా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి 2004లో రూ.3.50 కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మించారు. రోలుగుంటలో లక్ష లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకు నిర్మించి జానకీరాంపురంలో ఏటిలో నీటిని శుద్ధి చేసి బాధిత గ్రామాలకు సరఫరా చేసేవారు. ఏటిలో ఇసుక మాఫియా కారణంగా నీటిమట్టం అడుగంటి పోయి తాగునీరందని పరిస్థితి ఏర్పడింది. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 2020–21లో రూ.6 కోట్లు మంజూరు చేశారు. పనులు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది. అయితే అధికారులు ఆ నిధులతో పనులు జరపాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామంటున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద 50 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కోతలు కోసిన కూటమి నాయకులు చుక్కనీరు అందించకపోవడం బాధాకరమని తెలిపారు. తాము భూములు అడగడం లేదు, రుణాలు అడగడం లేదు.. తాగునీరవ్వండి మహాప్రభో అంటూ ఈ ధర్నాలో మహిళలు తమ గోడు వినిపించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు సీపీఎం నాయకులు కె.గోవింద, వి.నూకరత్నం, వి.శ్రీదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement