తీరంలో
● అడ్డుగోలుగా సముద్రపు ఇసుక తరలింపు
● పాయకరావుపేట, నక్కపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి పరిధిలో జోరుగా తవ్వకాలు
● ఇసుక దిబ్బలు తరిగిపోతే పోటు ముప్పు
● భవన నిర్మాణాల్లో యథేచ్చగా వినియోగం
● సంద్రం ఇసుక వాడితే అనతికాలంలోనే కూలిపోయే ప్రమాదం
● పట్టించుకోని రెవెన్యూ, మైరెన్, పోలీసు, అటవీ శాఖల అధికారులు
సాక్షి, అనకాపల్లి: ఇసుక తోడేళ్లు సముద్ర తీర ప్రాంతంపై పడ్డాయి...నదీగర్భాలను తోడేసిన ఇసుకాసురులు ఇప్పుడు సముద్ర ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నారు. నది ఇసుకలో సముద్ర ఇసుకను మిక్స్ చేసి విక్రయించి కాసులు వెనుకేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు మిక్స్ చేసే ఇసుకను వినియోగిస్తున్నారు. ఇసుకాసురుల నిర్వాకం వల్ల ఒక వైపు తీరం కోతకు గురవుతుండగా, మరో వైపు భవన నిర్మాణాల్లో నాణ్యత దెబ్బతింటోంది. జిల్లాలో ఉన్న 72 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కూటమి నేతల కనుసన్నుల్లోనే సముద్రపు ఇసుకను దొడ్డిదారిన విక్రయిస్తున్న ఇసుక మాఫియా రూ.లక్షల్లో వెనకేసుకుంటోంది. ఈ వ్యవహారమంతా అధికారులకు తెలిసినా కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతంలో ఇసుక తరిగిపోతుండడంతో ప్రకృతి విపత్తులు, తుపాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో అటవీ శాఖ వేసిన విలువైన సరుగుడు కలప కూడా అక్రమార్కుల పాలవుతోంది. విలువైన చెట్లు తరలిపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారుల్లో కనీస స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నా రెవెన్యూ, మైరెన్, పోలీసు, అటవీ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తీరప్రాంత గ్రామస్తుల వాపోతున్నారు.
ఇసుక దిబ్బలు క్షీణిస్తే పోటు ముప్పు
జిల్లాలో పాయకరావుపేట, నక్కపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ మండలాల పరిధిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని సమాచారం. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించరాదన్న నిబంధనలు ఉన్నప్నటికీ అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్లు, ట్రిప్పర్ల ద్వారా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఇసుకను నావెల్ బేస్ ప్రాజెక్టు (ఎన్‌ఏవోబీ)నిర్మాణం కోసం, అచ్యుతాపురంలో కంపెనీల ఏర్పాటుకు రవాణా చేస్తారు. తీరప్రాంతంలో ఇసుక తవ్వకాల కారణంగా సముద్రం కోతకు గురవుతుంది. ప్రకృతి విపత్తులు, తుపానులు వచ్చినప్పుడు మత్స్యకార గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.


