మృతుని భార్య రాజ్యలక్ష్మిని విచారిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్
నర్సీపట్నం:యువకుడి అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రోలుగుంట మండలం బుచ్చంపేటకి చెందిన లాలం సాయికుమార్ బుధవారం నర్సీపట్నం మండలం గబ్బాడ శివారు నెల్లిమెట్ట వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తమ గ్రామానికి చెందిన కొంతమంది సాయికుమార్‌ను హత్య చేసినట్లు మృతిని భార్య రాజ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త మృతిని హత్య కోణంలో విచారణ జరిపించాలని రాజ్యలక్ష్మి స్వ యంగా ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి ఫిర్యాదు చేసింది. ఖా‘కీలు’బొమ్మలేనా.. అన్న శీర్షికతో ‘సాక్షి’లో సాయికుమార్ మృతితో పాటు మరో మరణంపై శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసుల్లో కదలిక మొదలైంది. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాస్ స్వయంగా మృతుడి గ్రామం వెళ్లి విచారణ జరిపారు. ముందుగా మృతుడి భార్య రాజ్యలక్ష్మిని విచారించారు. తన భర్తది ముమ్మాటికీ హత్యేనని ఆమె డీఎస్పీ వద్ద స్పష్టం చేసింది. నిందితులు తమతో రాయబారాలు జరుపుతున్నారని, నగదు ఆశచూపి కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేస్తున్నారని ఆమె పోలీసులకు చెప్పింది. తమ కుటుంబం ఊరికి దూరంగా నివసిస్తున్నందున తన భర్త హత్య చేసినట్టే తనను, తన అత్త,మామల ను అంతమొదించే అవకాశం ఉందని రాజ్యలక్ష్మి భ యాందోళన వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి రక్ష ణ కల్పించాలని కోరింది. గ్రామంలో మరికొంత మందిని కూడా డీఎస్పీ విచారించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమైన డీఎస్పీ సంప్రదించగా విచారణ ప్రారంభమైంది, శవ పరీక్ష నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


