విశాఖ – కాకినాడ కోస్తా తీర అభివృద్ధికి ప్రణాళికలు
అనకాపల్లి: విశాఖ నుంచి కాకినాడ వరకూ కోస్తా తీరాన్ని పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (వీకేపీసీపీఐఆర్ వుడా) 640 చ.కి.మీటర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని వీకేపీసీపీఐఆర్ వైస్ చైర్మన్ ఎన్.తేజ్‌భరత్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు సన్ క్యాజిల్ హోటల్లో విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాకు చెందిన వివిధ శాఖల జిల్లా అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, కాకినాడ కోస్తా తీరాన 10 మండలాలు 97 గ్రామాల్లోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టూరిస్టు, పర్యాటక శాఖ, ఇండస్ట్రియల్ పార్కు, రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ మాస్టర్‌ప్లాన్‌కు ఎల్‌ఈఏ అసోసియేషన్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్(లీ) కన్సల్టెంట్‌గా నియమించడమైందన్నారు. నాలుగు జోనల్ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని, మార్చి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ స్థానిక ప్రజల్లో సమావేశాలు నిర్వహించి, అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన 9 జిల్లాలతో కూడిన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ వల్ల విశాఖ నుంచి కాకినాడ కోస్తా తీరంలో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, ఎంఓయూలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కాకినాడ గేట్‌వే పోర్ట్, నక్కపల్లి యాంకర్ పోర్టు వంటి కొత్త ఓడరేవులు సముద్ర ఎగుమతి సామర్ధాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, ప్రపంచ వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శౌర్యా మాన్ పటేల్, వీకేపీఐఆర్ జాయింట్ డైరెక్టర్ వి.శిల్పా, కాకినాడ జిల్లా జెడ్సీ సీఈవో లక్ష్మణ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు, లీ అసోసియేట్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


