పరిసరాల శుభ్రత మన బాధ్యత
● కలెక్టరేట్‌లో స్వచ్ఛ
ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
● జేసీ సౌర్య మాన్ పటేల్
తుమ్మపాల: ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారానే చెత్త లేని వాతావరణాన్ని సాధ్యం చేయగలమని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ అన్నారు. శనివారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆయన పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ప్రజల సహకారంతో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇళ్ల చుట్టూ చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధులు నివారించవచ్చన్నారు. స్వచ్ఛతను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని, అలా చేయడం వల్ల మన కుటుంబం, మన జిల్లా, మన దేశ ప్రజల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. వ్యర్థాలను తగ్గించడం, చెత్తా చెదారం లేని పరిసరాలను ఏర్పాటు చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత పద్ధతులు, ఘన వ్యర్థాల నిర్వహణ, మరియు ప్రజల భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్, అనకాపల్లి ఎంపీడీఓ పి.ఆశాజ్యోతి, డీఎల్‌పీవో మూర్తి, డిప్యూటీ ఎంపీడీవో రాము, పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.


