విద్యుదాఘాతంతో కూలీ మృతి
రోలుగుంట : కూలి కోసం వచ్చి విద్యుదాఘాతానికి గురై పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని కొమరవోలులో ఆదివారం చోటు చేసుకుంది. ఘటనపై రోలుగుంట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు. స్థానికులు అందించిన వివరాలివి. కొండపాలెం కాలనీ నుంచి కొమరవోలు వరకూ నీటి సరఫరా మోటారు లైనుకు సంబంధించి కొత్తగా విద్యుత్‌లైను ఏర్పాటు పనులు కాంట్రాక్టు కూలీలతో కొన్ని రోజులుగా చేపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుమారు 15 మంది కూలీలతో రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ కాంట్రాక్టర్ ఈ పనులు చేయిస్తున్నాడు. ఆదివారం కూలీలు స్తంభాలు ఏర్పాటు చేస్తుండగా ఉదయం 10:30 గంటల సమయంలో షాపీకూల్(28) అనే కూలీ విద్యుదాఘాతానికి గురై అక్కడి కక్కడే మరణించాడు. ఘటనపై ఎస్‌ఐ రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో విచారించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.
విద్యుదాఘాతంతో కూలీ మృతి


