సిటీ ఎకనమిక్ రీజియన్‌కు..
రేర్ ఎర్త్ మాగ్నెట్ కారిడార్‌తో కాస్తా ఉపశమనం అరకులో ట్రెక్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ పన్ను నిబంధనల సడలింపుతో ఉద్యోగులకు ఊరట
సాక్షి, విశాఖపట్నం:
దాదాపు రెండు గంటల పాటు సాగిన విత్త మంత్రి ప్రసంగంలో విశాఖపట్నం అనే పేరు వినిపిస్తుందేమోనని జిల్లా ప్రజలంతా ఆశగా ఎదురు చూశారు. కానీ.. ఎక్కడా వినిపించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా మంజూరు చెయ్యకపోరా అనుకున్నా.. అవేమీ కనిపించలేదు. పోనీ.. ఉన్న ప్రాజెక్టులకై నా నిధులు విదిలించారా అంటే అతీగతీ లేదు. ఒక్కటంటే ఒక్క కేటాయింపు కూడా ప్రత్యేకంగా లేకపోవడంతో డీలాపడ్డారు. దేశంలోని మేజర్ పోర్టులకు కేటాయించిన మాదిరిగానే విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ)కు కేటాయింపులు జరిగాయే తప్ప.. ప్రత్యేకంగా రూపాయి ఇవ్వలేదు.
అందరితో పాటే.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు..
విశాఖపట్నం పోర్టులో రూ.1,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా ఏమైనా కేటాయింపులు జరుగుతాయని భావించినా.. ఎక్కడా కానరాలేదు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమవుతున్న నేపథ్యంలో విశాఖ–భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్‌కు కేంద్రం నేరుగా గ్రాంట్లు ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసింది. రక్షణ రంగానికి రూ.7.84 లక్షల కోట్లు కేటాయించడంతో విశాఖ రక్షణ రంగానికి ఊరటనివ్వనుంది. అయితే.. షిప్‌యార్డు, డాక్‌యార్డుకు ఎంత మేర వస్తాయనేది సందిగ్థంగా మారింది.
మొత్తంగా పన్ను సడలింపులతో వేతన జీవుల్లో కొంత ఊరట లభించడం.. ఒకట్రెండు చోట్ల కేటాయింపుల ఉపశమనం మినహా.. సీతమ్మ.. ఈ బడ్జెట్‌లో విశాఖపై కరుణ చూపించలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలోని ఏడు నగరాలను సిటీ ఎకనమిక్ రీజియన్లు(సీఈఆర్)గా కేంద్రం అభివృద్ధి చెయ్యనుంది. ఇందులో విశాఖపట్నం కూడా ఉంది. ప్రతి సీఈఆర్‌కు ఐదేళ్లకు గాను రూ.5 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. అంటే.. విశాఖ రీజియన్ అభివృద్ధి కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు జరగనుండటం ఊరటనిచ్చే అంశం.
బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత
కూర్మన్నపాలెం: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యత లభించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ‘మైనింగ్ మిషన్’ ఏర్పాటుతో ఒడిశా–ఏపీ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రజలందరికీ మేలు చేకూరేలా నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.


