గౌరమ్మ ఉత్సవానికి వేళాయె
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పట్టణమంతా విద్యుత్ దీపాలంకరణతో మిరుమిట్లు గొలుపుతోంది. ఏటా జనవరి మూడో శనివారం ఉత్సవాలను నిర్వహిస్తారు. 172 ఏళ్ల క్రితం వేల్పులవారి స్వగృహంలో గౌరమ్మ వెలసింది. అప్పటి నుంచి నిత్య పూజలందుకుంటున్న అమ్మవారి ఉత్సవాన్ని ఏటా డిసెంబరు మూడో వారంలో నిర్వహించేవారు. దశలువారీగా ఖ్యాతినార్జించిన ఈ ఉత్సవం వేల్పులవీధికి పరిమితం కాకూడదని వీధి పెద్దలు దివంగత వాకాడ దాలెప్ప, రౌతు ఆదినారాయణ, బోయిన రమణ తదితరులు జనవరి మూడో శనివారానికి మార్చారు. అప్పటి వరకూ బుర్రకథలు, బళ్లవేషాలు, నేలవేషాలతో ఉత్సవాన్ని నిర్వహించేవారు. 1983 తర్వాత నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. 2005లో మెయిన్‌రోడ్డు విస్తరణలో అమ్మవారి గుడి కొంతమేర కోల్పోవడంతో 2022లో కొత్త ఆలయాన్ని నిర్మించారు.
3 రోజుల పాటు ఊరేగింపు
మొదట్లో వేల్పులవీధిలో మాత్రమే అమ్మవారిని ఊరేగించేవారు. ప్రస్తుతం శనివారం ఉదయం అనకాపల్లి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు ప్రారంభమై సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగనుంది. ఆ రోజు వేకువన స్థానిక శారదానదిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ మహోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
ప్రత్యేక ఆకర్షణగా నేలవేషాలు, బాణసంచా విన్యాసాలు
ఆంధ్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి పలువురు కళాకారులతో పులివేషాలు, గరగల నృత్యాలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, తదితర నేల వేషాల ప్రదర్శనలను ఉదయం 9 నుంచి రాత్రి ఒంటి గంట వరకూ నిర్వహిస్తారు. అదే సమయంలో మెయిన్‌రోడ్డులో వివిధ రకాల స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. వేల్పులవీధి గౌరమ్మ ఉత్సవమంటే ముందుగా గుర్తుకొచ్చేది స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో దివంగత ముందుగుండు సీతారామయ్య బాణసంచా విన్యాసాలే.. వివిధ ఆకృతుల్లో ముందుగుండు అమర్చి చేసే విన్యాసాలు కచ్చితంగా చూసి తీరాల్సిందే. సుమారు రెండు గంటల పాటు బాణసంచా, క్రాకర్స్ కాలుస్తారు. డీఎస్పీ ఎం.శ్రావణి పర్యవేక్షణలో పట్టణ, ట్రాఫిక్ సీఐలు ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
ఈ ఏడాది ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉచిత మెడికల్ క్యాంప్‌లు, వివిధ ప్రాంతాల్లో ఉచిత ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాం.
– గరికి వెంకటరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు, వేల్పులవీధి, అనకాపల్లి
వేల్పులవీధిలో గౌరీపరమేశ్వరుల
సంబరానికి ముస్తాబు
నేడు పట్టణ పురవీధుల్లో
ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రానున్న భక్తులు
గౌరమ్మ ఉత్సవానికి వేళాయె
గౌరమ్మ ఉత్సవానికి వేళాయె
గౌరమ్మ ఉత్సవానికి వేళాయె


