నిర్లక్ష్యపు మంటలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు మంటలు

Jan 4 2026 7:08 AM | Updated on Jan 4 2026 7:08 AM

నిర్లక్ష్యపు మంటలు

నిర్లక్ష్యపు మంటలు

సాక్షి, అనకాపల్లి/ రాంబిల్లి (అచ్యుతాపురం) : రాంబిల్లి సెజ్‌లో లాలం కోడూరులో గల ఎస్‌వీఎస్‌ ఫార్మా సంస్థలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం మరోసారి పరిశ్రమల్లో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, యాజమాన్యాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫార్మా కంపెనీలో 8 నెలల క్రితం కూడా అగ్ని ప్రమాదం జరిగి విజయనగరానికి చెందిన ఉమామహేశ్వరరావు అనే కార్మికుడు కాలిపోయి క్షతగాత్రుడిగా మిగిలిపోయాడు. ఇప్పటికీ ఒక కన్ను, కాలు పనిచేయలేదు. ఆనాడే సేప్టీ మెజర్స్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పై అధికారులు చెప్పడం, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకూ ఆ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను కాపాడేందుకు తగిన సేప్టీ మెజర్‌మెంట్స్‌ లేవు. కనీసం అందులో పనిచేస్తున్న 25 మంది కార్మికుల్లో కెమిస్ట్‌, సీనియర్‌ కెమిస్ట్‌ గానీ లేరు. ఎక్కువగా హెల్పర్లతోనే నడిపిస్తున్నట్టు అందులో పనిచేసే కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ, పరిశ్రమల్లో సేఫ్టీ అంశాలు, పరికరాలపై నిత్యం తనిఖీలు చేయడం వట్టి మాటగానే మారింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు, నాయకులు తరువాత అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పరిశ్రమలలో భద్రత, ప్రమాదాల నివారణ, రక్షణ అంశాలను జిల్లాకు చెందిన అధికారుల బృందాలు పరిశీలించి, పైఅధికారులకు నివేదికలు ఇచ్చినా వరుసగా ప్రమాదాలు జరగడంతో పారిశ్రామిక రంగ భద్రతలోని డొల్లతనం బయటపడుతుంది.

రక్షణ లేని కార్మిక జీవితాలు..

ఫార్మా పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికుల భద్రత గాల్లో దీపంలా మారింది. జిల్లాలో అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌ పరిధిలో పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేప్టీ మెజర్స్‌ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్‌ సిబ్బంది లేకపోవడంతోనే అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పరిశ్రమల్లో స్థానికుల కంటే స్థానికేతురులనే ఉద్యోగాలకు తీసుకోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రశ్నించే కార్మికులే లేకుండా పోతున్నారు. చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు సరైన అంబులెన్స్‌ లాంటి వాహన సౌకర్యాలు, వారి పరిశ్రమల్లోనే వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగి అక్కడ నుంచి నగరానికి చేరేలోపు కార్మికులు మృత్యువాత పడుతున్నారు.

యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే...

ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు కార్మిక సంఘాల నాయకులు, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కమిటీల పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పరవాడ–అచ్యుతాపురం సెజ్‌ల్లో జరిగిన ప్రమాదాలపై అధికార యంత్రాంగంతో కమిటీలు వేసి విచారణ నిర్వహించారు. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఉంటే నేడు ఇలాంటి ప్రమాదాలు మరలా సంభవించేవికాదని చెబుతున్నారు.

కార్మికుల ప్రాణాలకేదీ రక్షణ?

ఎస్‌వీఎస్‌ పరిశ్రమలో

అగ్ని ప్రమాదంతో ఆందోళన

ప్రమాదాల నివారణలో ప్రభుత్వం,

యాజమాన్యాల అలసత్వం

అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌లో

తరుచూ అగ్ని ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement