ఘనంగా తోడపెద్దు ఉత్సవం
నలభై ఏళ్ల తరువాత నిర్వహణ
రోలుగుంట: గ్రామశాంతి, పాడిపంటల అభివృద్ధి కోరుతూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఆధ్వర్యంలో పూర్వపు సంప్రదాయాలను పాటిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ నేత పోతల లక్ష్మీ శ్రీనివాస్ తోడ పెద్దోత్సవాన్ని సుమారు నలభై ఏళ్ల తరువాత నిర్వహించారు. గతంలో ఈ గ్రామంలో తోడపెద్దు ఉండేది. అది మరణించడంతో అప్పటి నుంచి ఈ ఉత్సవ నిర్వహణ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ గ్రామస్తుల అభిమతం మేరకు సింహాచలం దేవస్థానం నుంచి అక్కడ ఆలయ కమిటీ అనుమతితో తోడపెద్దును గ్రామానికి గురువారం తీసుకొచ్చారు. శుక్రవారం ఉత్సవరాట వేశారు. భజనలు, కోలాటం నిర్వహించారు. రాత్రంతా జాగరణ చేశారు. శనివారం వేకువ జాము నుంచి మధ్యాహ్నం వరకూ భక్తి కీర్తనలు అలపించారు. భక్తులు గోమాతను దర్శించుకొని పూజించుకున్నారు. అనంతరం నిర్వాహకులు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.


