
‘కృష్ణమూర్తిని బెదిరింపులకు గురిచేయలేదు’
బుచ్చెయ్యపేట : ఐయితంపూడి గ్రామానికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు బెదిరించారని అతని తండ్రి మహాలక్ష్మినాయుడు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితులైన కృష్ణమూర్తితో పాటు ఇదే గ్రామానికి చెందిన ఐయితరెడ్డి శివకుమార్‌ను జూన్ 2వ తేదీన విచారించామన్నారు. విచారణలో ఇద్దరూ దొంగతనం చేసినట్టు, రెండు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాన్నారు. దొంగతనం చేసినట్టు ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దగ్గర ఒప్పుకున్నారన్నారు. అదే రోజు నిందితులు ఇద్దరి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితులకు వైద్య పరీక్షలు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినపుడు వారి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. వారిని విచారణ పేరుతో కొట్టడం గాని తిట్టడం గాని చేయలేదన్నారు. కృష్ణమూర్తి తనకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల 4వ తేదీన విషం తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఇదే విషయమై కృష్ణమూర్తికి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామన్నారు. దీనిపై ఇతరుల చెప్పిన విషయాలపై లేనిపోని ఆరోపణలు చేయరాదని కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు విన్నవిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.