ఉలిక్కిపడిన విశాఖ | - | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన విశాఖ

Aug 8 2025 7:32 AM | Updated on Aug 8 2025 7:32 AM

ఉలిక్

ఉలిక్కిపడిన విశాఖ

వెల్డింగ్‌ దుకాణంలో పేలిన సిలిండర్‌
● భూకంపం వచ్చినట్లు అదిరిన వన్‌టౌన్‌ ● రెండు కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం ● ముగ్గురు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు ● 9 అడుగుల ఎత్తయిన గోడ దాటి పడిన మృతుల శరీర భాగాలు ● షాపు వెనుక 150 అడుగుల దూరంలో ఉన్న ఇళ్లపై పేలుడు ప్రభావం ● ఓ ఇంట్లో సీలింగ్‌ పడి చిన్నారికి గాయం

విశాఖ సిటీ : విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ విస్ఫోటనంతో పాత నగరం భూకంపం వచ్చినట్లు అదిరింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌ రోడ్డులో ఒక వెల్డింగ్‌ దుకాణంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరి వ్యక్తుల శరీర భాగాలు 9 అడుగుల ఎత్తయిన గోడపై నుంచి ఎగిరి అవతల పడ్డాయి. పేలుడు కారణంగా సంభవించిన మంటల్లో చిక్కుకున్న నలుగురు తీవ్రంగా కాలిపోయారు. దీంతో వన్‌టౌన్‌ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కిలోమీటర్ల మేర ప్రజలను ఈ పేలుడు శబ్ధం భయాందోళనకు గురిచేసింది.

చెల్లాచెదురైన శరీర భాగాలు

సున్నపువీధి ప్రాంతానికి చెందిన చల్లా గణేష్‌(44) వెల్డింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే బుక్కా వీధిలో ఫిషింగ్‌ హార్బర్‌ రోడ్డులో వెల్డింగ్‌ దుకాణాన్ని తెరిచాడు. ఒడిశాకు చెందిన శ్రీను హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం హెల్పర్‌ శ్రీను(30)తో పాటు మరో ఇద్దరు వర్కర్లు ఎర్ర ఎల్లాజీ(45), సన్యాసిరావు(46)లను పనికి పెట్టుకున్నాడు. వీరు ఎప్పటిలాగే వెల్డింగ్‌, గ్యాస్‌ కటింగ్‌ పనులు చేస్తుండగా సాయంత్రం 4.30 గంటలకు సిలిండర్‌ పేలిపోయింది. అక్కడే ఉన్న యజమాని గణేష్‌, హెల్పర్‌ శ్రీనుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. వెల్డింగ్‌ షాపు నామరూపాలు లేకుండా తునాతునకలైంది. పేలుడు ధాటికి మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేస్తున్న వర్కర్లు ఎర్ర ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు పక్కన ఉన్న స్క్రాప్‌ దుకాణంలో పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు(27), ఇప్పిలి రంగారావు(53) ఆ మంటలకు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటోలో క్షతగాత్రుల తరలింపు

భారీ ప్రమాదం జరిగినప్పటికీ ఘటనా స్థలానికి 108 అంబులెన్సులు రాకపోవడం గమనార్హం. కేవలం మృతదేహాల తరలింపు కోసం మాత్రమే అంబులెన్సును తీసుకొచ్చారు. నలుగురు క్షతగాత్రులను ఆటోలో తరలించడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో 90 శాతానికి పైగా కాలిన శరీరంతో బాధను తట్టుకోలేక.. ఆర్తనాదాలు పెడుతూ ఆటో ఎక్కడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.

ఇద్దరి పరిస్థితి విషమం

ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఎర్ర ఎల్లాజీ(45), సన్యాసిరావు(46), చింతకాయల ముత్యాలు(27), ఇప్పిలి రంగారావు(53)లను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో చింతకాయల ముత్యాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఎల్లాజీ 95 శాతం, రంగారావు 75 శాతం మేర కాలిపోయారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 18 శాతం కాలిన గాయాలైన సన్యాసిరావును చికిత్స కోసం మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు.

కంపించిన ఇళ్లు.. చిన్నారిపై పడిన సీలింగ్‌

ఒక్కసారిగా భారీ శబ్ధంతో భూమి అదరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో సుమారు 200 మీటర్ల వరకు ఉన్న ఇళ్లు కంపించాయి. వెల్డింగ్‌ దుకాణానికి 150 అడుగుల దూరంలో ఉన్న ఒక ఇంట్లో సీలింగ్‌ కూలింది. ఆ ఇంట్లో గాయత్రీ అనే చిన్నారి(11)పై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో ఆమె తలకు గాయమైంది. మరికొన్ని ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఘటనా స్థలానికి అధికారులు

ఘటనా స్థలాన్ని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మమూర్‌ అశోక్‌, ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్‌ సందర్శించారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యం గురించి వివరించారు.

మృతులు

చల్లా గణేష్‌(44), శ్రీను (30), చింతకాయల ముత్యాలు(27)

క్షతగాత్రులు

ఎర్ర ఎల్లాజి(45), టి.సన్యాసిరావు(46),

ఇప్పిలి రంగారావు(53)

ఏ సిలిండర్‌ పేలింది?

ఘటనా స్థలంలో ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు డొమెస్టిక్‌ సిలిండర్‌ కూడా ఉంది. వీటిలో ఏ సిలిండర్‌ ప్రమాదానికి కారణమైందన్న విషయం తేలాల్సి ఉంది. సాధారణంగా డొమెస్టిక్‌ సిలిండర్‌ పేలితే అది ముక్కలైపోతుంది. కానీ అక్కడ ఉన్న సిలిండర్‌ బాగానే ఉంది. అలాగే ఆక్సిజన్‌ సిలిండర్లు మూడు ఉండగా.. ఒకదానికి మాత్రం పైన వాల్వ్‌ పడిపోయి ఉంది. సాధారణ సిలిండర్‌ కంటే ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలుడు కారణంగానే భారీగా విస్ఫోటనం సంభవిస్తుంది. చదరపు ఇంచ్‌కు 2 వేల పౌండ్ల ఒత్తిడితో సంభవించే ఈ పేలుడుకు భారీ నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్యాస్‌ సిలిండర్‌ పేలితే మాత్రం 5 మీటర్ల పరిధిలో ఉన్న వారికి మృత్యు ప్రమాదం ఉంటుందని, గరిష్టంగా 32 మీటర్ల దూరంలో ఉన్న వారికి గాయాలయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రకారం ఈ ఘటనలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిందా? లేదా గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదానికి కారణమైందన్నది విచారణ చేయాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఉలిక్కిపడిన విశాఖ1
1/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ2
2/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ3
3/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ4
4/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ5
5/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ6
6/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ7
7/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ8
8/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ9
9/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ10
10/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ11
11/12

ఉలిక్కిపడిన విశాఖ

ఉలిక్కిపడిన విశాఖ12
12/12

ఉలిక్కిపడిన విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement