నటుడిగా కొనసాగడమే ధ్యేయం
కశింకోట: జీవితాంతం నటునిగా కొనసాగడమే తన ధ్యేయమని సినీ నటుడు, టీవీ, నాటక రంగ కళాకారుడు గోపరాజు విజయ్ అన్నారు. కశింకోటలో తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీల్లో భాగంగా ‘జనరల్ బోగీలు’నాటిక ప్రదర్శనకు వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తాను ఒక వైపు సినిమా నటునిగా, మరో వైపు నాటక రంగ కళాకారునిగా కొనసాగుతున్నానన్నారు. నాటక రంగం నుంచే నట జీవితాన్ని ప్రారంభించానన్నారు. నాటక, సినిమా రంగాలు రెండు కళ్లులాంటివన్నారు. పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించానని చెప్పారు. తన తండ్రి గోపరాజు రమణ రంగ స్థల, టీవీ, సినిమా నటునిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన వారసునిగా ప్రవేశించి 36 ఏళ్లగా నటునిగా కొనసాగుతున్నానన్నారు. ఇప్పటికి 20 వరకు సినిమాల్లో నటించానన్నారు. సత్యనారాయణస్వామి మహాత్మ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానని వివరించారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సర్పంచ్‌గా నటించానన్నారు. బీమ్లా నాయక్, ఎఫ్–3, తదితర చిత్రాలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. సామజవరగమన, గుంటూరు కారం, వినరో భాగ్య విష్ణు కథ, తదితర చిత్రాల్లో నటించానన్నారు. ఉత్తమ కళాకారునిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 13 నంది పురస్కారాలు, కందుకూరి పురస్కారం అందుకున్నట్టు విజయ్ తెలిపారు.
సినీ, టీవీ, నాటక రంగ కళాకారుడు గోపరాజు విజయ్
నటుడిగా కొనసాగడమే ధ్యేయం


