కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు
యథేచ్ఛగా రవాణా
యలమంచిలి రూరల్: జిల్లాలో కోడి మాంసం వ్యర్థాల వ్యాపారం అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. వీటి సేకరణ,అక్రమ రవాణాపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా,నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న కోడి మాంసం వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తున్నారు.చికెన్ వ్యర్థాలను మేతగా తింటున్న చేపలు తక్కువకాలంలో ఎదుగుతున్నాయి. ఈ చేపల్ని తింటున్న ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చికెన్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో పర్యావరణానికి సైతం హానికలుగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు, వీటిని రవాణా చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వాహనాలను సీజ్ చేయాలని ఈ నెల 16న డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీలకు,ఈ నెల 21న అనకాపల్లి ఎస్పీ నుంచి జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.అయినప్పటికీ ఈ నెల 25వ తేదీన కూడా యలమంచిలి,అనకాపల్లి,అచ్యుతాపురం,నక్కపల్లి,అడ్డరోడ్డు,నర్సీపట్నం, చోడవరం,పాయకరావుపేట సహా జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు,మేజర్ పంచాయతీల నుంచి కోడి మాంసం వ్యర్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా జరగడం గమనార్హం. తమ కళ్లముందే కోడి మాంసం వ్యర్థాలను డ్రమ్ముల్లో వేసి తరలించుకుపోతున్నా అధికారయంత్రాంగం పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మిగతారోజులతో పోల్చితే ఆదివారం కోడి మాంసం వ్యర్థాలు ఎక్కువగా వస్తాయి.ఇది తెలిసినా వివిధ శాఖల అధికారులు మాత్రం తమకెందుకులే అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమ ఆర్జనకు అలవాటుపడిన వ్యాపారులు మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు దర్జాగా వాహనాల్లో చికెన్ వ్యర్థాలను తరలించుకుపోతున్నారు.
నెలకు 2వేల టన్నుల కోళ్ల దిగుమతి
జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారు 2,100 వరకు కోడి మాంసం విక్రయ కేంద్రాలున్నాయి.నిత్యం 60 టన్నుల కోళ్లు,ఆదివారం ఒక్కరోజే 100 నుంచి 120 టన్నుల కోళ్లను చికెన్ షాపుల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు.ప్రతి నెల సుమారు 2వేల టన్నుల వరకు కోళ్లు దిగుమతి అవుతున్నాయి.చికెన్ షాపుల్లో మాంసం విక్రయించగా మిగతా చర్మం,పేగులు,కాళ్లు,ఇతర వ్యర్థాలను షాపుల నిర్వాహకుల దగ్గర్నుంచి కిలో రూ.3 నుంచి రూ.5 వరకు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద షాపుల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేస్తుండగా,చిన్న దుకాణాల నిర్వాహకులు ఉచితంగానే అందజేస్తున్నారు.ఇలా సేకరించిన చికెన్ వ్యర్థాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల వ్యాపారులకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు చేపల చెరువుల వ్యాపారులే నేరుగా చికెన్ వ్యర్థాలను డ్రైవర్లు,సహాయకులను నియమించుకుని తరలిస్తున్నారు.ఒక కిలో కోడి మాంసం నుంచి సుమారు 250 నుంచి 300 గ్రాముల చికెన్ వ్యర్థాలు వస్తాయి.జిల్లాలో ప్రతి నెలా దిగుమతి చేసుకుంటున్న కోళ్ల ద్వారా 600 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వ్యాపారులు ఒకసారి వాహనంలో 9 డ్రమ్ముల వ్యర్థాలు తీసుకెళ్తున్నారు.ఒక్కో డ్రమ్ములో 150 నుంచి 200 కిలోల వరకు చికెన్ వ్యర్థాలు ఉంటున్నాయి. ఒకసారి వాహనంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తే ఆ వ్యాపారికి అన్ని ఖర్చులూ మినహాయించుకుంటే రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వస్తోంది.ఈ లెక్కన నెలకు రవాణా అవుతున్న 2వేల టన్నుల చికెన్ వ్యర్థాలతో సుమారు రూ.60 లక్షల వరకు ఆదాయాన్ని ఈ అక్రమ వ్యాపారం ద్వారా కొందరు సంపాదిస్తున్నారు. ఏటా రూ.7 కోట్లపైనే వెనకేసుకుంటున్నారు.
ప్లాస్టిక్ డ్రమ్ములో చికెన్ వ్యర్థాలు
యలమంచిలిలో ఆదివారం తరలిస్తున్న కోడి మాంసం వ్యర్థాలు
చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు
భారీగా ఆర్జిస్తున్న అక్రమార్కులు
ప్రమాదంలో ప్రజారోగ్యం,పర్యావరణం
కేసులు నమోదు చేయాలని డీజీపీ,ఎస్పీ తాజా ఆదేశాలు
ఫిర్యాదులున్నా పట్టించుకోని అధికారులు
వ్యర్థాల రవాణా నిషేధం
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,చేపలకు మేతగా వినియోగించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ,మత్స్య శాఖలు 2005లో జీవో ఎంఎస్ 54, 2016లో జీవో ఎంఎస్ 56లను విడుదల చేశాయి.చికెన్ వ్యర్థాల రవాణాను కట్టడి చేయడానికి మండల స్థాయిలో తహసీల్దార్ చైర్మన్‌గా,వీఆర్వో,రవాణా, స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సభ్యులుగా,మత్స్య అభివృద్ధి అధికారి మెంబర్ కన్వీనర్‌గా కమిటీని నియమించారు.అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నిరాంటంకంగా సాగుతోంది. నెల రోజుల క్రితం కొందరు మీడియా ప్రతినిధులు యలమంచిలి పట్టణంలో చికెన్ వ్యర్థా లను తరలిస్తున్న వాహనాన్ని ఆపితే.. వాహనాన్ని ఆపే అధికారం మీకు లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తా నని సదరు వ్యాపారి మీడియా ప్రతినిధులనే తిరిగి బెదిరించేలా మాట్లాడడం వెనుక ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా చికెన్ వ్యర్థాలను వ్యాన్లలో తరలిస్తున్నా ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయస్థితి నెలకొంది. నిత్యం చికెన్ వ్యర్థాల వాహనాలు వెళ్తుంటే ముక్కుపుటాలు అదిరేలా వచ్చే దుర్వాసనను ప్రజలు భరించాల్సిన దుస్థితి ఉంటోంది.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
యలమంచిలి నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 19న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలించి పక్క జిల్లాల్లోని చెరువుల్లో చేపలకు మేతగా ఉపయోగిస్తున్నారు.ఇది ప్రజారోగ్యానికి చాలా హానికరం.నేనిచ్చిన ఫిర్యాదుకు జవాబుగా చర్యలు తీసుకున్నట్టు జిల్లా మత్స్యశాఖాధికారి నుంచి సమాచారం వచ్చింది. అయితే ఆదివారం యలమంచిలిలో యఽథావిధిగా చికెన్ వ్యర్థాలను తరలించారు. దీనికి సంబంధించి ఫొటోలు,వీడియోలను జిల్లా మత్స్య శాఖాధికారికి వాట్సాప్ ద్వారా పంపించాను.స్పందన లేదు.అధికారుల చర్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా పూర్తిగా కట్టడి చేయడానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. – చాకలి నూకరాజు, ఆర్టీఐ కార్యకర్త,జంపపాలెం
కఠిన చర్యలు తీసుకుంటాం
జిల్లాలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటాం.అన్ని శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీలు వేసుకుని రహదారులపై చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచుతాం.చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది.చికెన్ వ్యర్థాలతో పెరిగిన చేపలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎస్పీతో చర్చించి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం.
– వి.ప్రసాద్, జిల్లా మత్స్యశాఖాధికారి,అనకాపల్లి
డీజీపీ,ఎస్పీ ఆదేశాలు బేఖాతర్
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,వాటిని చెరువుల్లో చేపలకు మేతగా ఉపయోగించడాన్ని సీరియస్‌గా పరిగణించిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆదేశాలతో గత మార్చి నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి, చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలు, అందుకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు,నగరాల సీపీలకు ఆదేశాలు వచ్చాయి. చికెన్ వ్యర్థాలు వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు,పర్యావరణం,పరిశుభ్రత దెబ్బతింటాయని, చట్టపరమైన నిబంధనలను అతిక్రమిస్తున్న అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చికెన్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చో స్పష్టంగా తెలియజేశారు.ఈ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ నెల 21న మెమో పంపారు. పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను సైతం క్షేత్రస్థాయిలో యంత్రాంగం బేఖాతరు చేస్తోంది.ఆదివారం జిల్లా వ్యాప్తంగా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా మామూలుగానే జరగడం దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేయలేదు. పోలీసు,ఇతర శాఖల ఉన్నతాధికారుల ఆదేశాలే క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకాకపోవడంతో సామన్య ప్రజలు తమ కళ్లెదురుగా చికెన్ వ్యర్థాల రవాణా జరగడం చూస్తున్నా ఫిర్యాదు చేయడానికి సైతం వెనకాడే పరిస్థితులు ఉంటున్నాయి.
కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు
కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు
కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు
కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు
కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు


