సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వివిధ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా బీజేపీ పాలన సాగుతోందని తెలిపారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న తదితర డిమాండ్లతో ఈనెల 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు చెప్పారు. మోడీ పాలనలో కార్మిక రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని చెప్పారు. రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోన మోహనరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, కూలీల జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు దుర్గారాణి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.పార్వతి, జిల్లా నాయకులు వి.వి.శ్రీనివాసరావు, ఆర్.రాము, గనిశెట్టి సత్యనారాయణ, జి.దేవుడు నాయుడు, ప్రేమ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


