ఈ సర్పంచ్‌ వెరీ స్పెషల్‌ | Sakshi
Sakshi News home page

ఈ సర్పంచ్‌ వెరీ స్పెషల్‌

Published Tue, Dec 26 2023 1:54 AM

- - Sakshi

రాజకీయాన్ని సంపాదనకు మార్గం అనుకునే ప్రస్తుత రోజుల్లో ఓ సర్పంచ్‌ తీరు ఆదర్శంగా నిలిచింది. సరైన రోడ్డు సదుపాయం లేక గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన ఆమె తన సొంత నిధులతో వంతెన నిర్మించారు. నాతవరం మండలంలోని వైబీ అగ్రహారం ఊరగెడ్డపై సర్పంచ్‌ కోసూరి విజయ నిర్మించిన వంతెన గ్రామస్తుల వెతలను తొలగించింది. వారి మన్ననలు పొందేలా చేసింది.

అనకాపల్లి: మండలంలోని వైబీ అగ్రహారం పంచాయతీకి దశాబ్దాలుగా సరైన రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనే లేదు. ఈ పంచాయతీ మొదటి నుంచీ టీడీపీకి కంచుకోట. టీడీపీ మండల అధ్యక్షుడే ఈ గ్రామానికి 15 ఏళ్లుగా సర్పంచ్‌. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పంచాయతీని ఈసారి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ ఆశీస్సులతో కోసూరి విజయ గెలిచారు. ఇంతటి నమ్మకాన్నిచ్చిన పంచాయతీ ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేయాలని సర్పంచ్‌ విజయ, ఆమె భర్త బుజ్జి నిర్ణయించుకున్నారు.

5 కి.మీ. దూరం తగ్గింది
దీంతో గ్రామానికి అనుకుని ఉన్న ఊరగెడ్డపై వంతెన నిర్మిస్తే మండల కేంద్రానికి వెళ్లే దూరం 5 కి.మీ. తగ్గనుండటంతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ సొంత నిధులు రూ.3.40 లక్షలు వెచ్చించి వంతెనతోపాటు, అనుసంధాన రోడ్డును పూర్తి చేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో మండల కేంద్రానికి వెళ్లే దూరం, సమయం తగ్గడంతోపాటు, ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల భూముల్లో రైతుల పండించే వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఇపుడు ఒకటిన్నర కి.మీ. ప్రయాణిస్తే పంట ఉత్పత్తుల్ని గమ్యస్థానానికి చేరవేయొచ్చు. మరోవైపు నాయుడుపాలెం, మన్యపురట్ల, లింగంపేట, మండల కేంద్రం నాతవరానికి దగ్గర దారి ఏర్పడింది.

పెరిగిన భూముల ధరలు
వంతెన నిర్మాణంతో చుట్టు పక్కల వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు మార్గం సుగమం కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత భూముల ధరలు పెరిగిపోయాయి. నేరుగా పంట పొలాల్లోకి వాహనాలు పోయే మార్గం ఏర్పాటయింది. సర్పంచ్‌ తన సొంత నిధులతో నిర్మించిన వంతెనను ఆర్భాటాలకు తావులేకుండా వార్డు సభ్యులు, గ్రామపెద్దలతోనే ప్రారంభించి, రాకపోకలు సాగించడం గమనార్హం. దీనిపై సర్పంచ్‌ విజయ సాక్షితో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రచారం వద్దని, గ్రామస్తుల హృదయాల్లో తాము చేసిన మంచి నిలిచిపోతే చాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అఽందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement