నర్సీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా శిక్షణాధికారి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి సూచించారు. శుక్రవారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల విధులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైన ప్రక్రియ అని, వాటిని స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనీలు వి.వి.డి.ప్రభాకర్, ఎ.వి.రాజుగోపాల్, కె.అప్పలనాయుడు ఎన్నికల నిర్వహణ విధానం, బ్యాలెట్ బాక్సుల వినియోగం, బ్యాలెట్ పత్రాల నిర్వహణ, గుర్తు ముద్రించే విధానం, సీలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.


