ఆంత్రపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆచార్య శర్మ
విశాఖ విద్య: భాషల పరిరక్షణకు నవతరం వారధులుగా నిలవాలని ఆంత్రపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆచార్య బి.వి. శర్మ అన్నారు. ఏయూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమావేశ మందిరంలో భారతీ య భాష సమితి సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘గిరిజన భాషలు–భారతీయ భాషలు’ అంశంపై రెండు రోజుల సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తెగలకు భాష ప్రత్యేక గుర్తింపును అందిస్తుందని, భాషలు అంతరించిపోతే వాటితో ముడిపడిన జ్ఞానం కూడా నశించే ప్రమాదం ఉందన్నారు. భాషలు కేవలం భావ వ్యక్తీకరణ సాధనాలు మాత్రమే కాకుండా ఆయా సమూహాల సంస్కృతి, జీవన విధానాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గిరిజన భాషలను గుర్తించడం, వాటిని మ్యాపింగ్ చేసే దిశగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు. భాషలకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించేందుకు ఇలాంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ భాషలను సాంకేతికతతో అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. భాషావేత్తలు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు.ఆదివాసీ విద్యార్థులు పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు చేరే సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అల్లూరి జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి ఏయూలోని వివిధ విభాగాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ మేరకు జిల్లా యంత్రాంగంతో అవగాహన ఒప్పందం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆదివాసీల సంప్రదాయ జ్ఞానం, ఆరోగ్యం, జీవనశైలిపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.భారతీయ భాష సమితి సీనియర్ ఎక్స్‌పర్ట్ ఆచార్య సర్రాజు మాట్లాడుతూ భారతీయ భాషల మధ్య ఏకత్వం, సామరస్యాన్ని పెంపొందించే దిశగా సమితి పనిచేస్తోందన్నారు. దేశంలో 1300కు పైగా భాషలు ఉన్నాయని, కొన్ని భాషలకు లిపి ఉండగా మరికొన్నింటికి లేదని తెలిపారు. గిరిజన భాషల్లో విద్యా సంబంధిత పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ భాషలను కృత్రిమ మేధసాంకేతికతతో అనుసంధానించాలని సూచించారు.సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్. రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో అతిథులను ఏయూ వీసీ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సదస్సును ఆచార్య పి.వి. లక్ష్మీనారాయణ, ఆచార్య డి. సంధ్య దీపిక సమన్వయం చేశారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.


