యలమంచిలి రూరల్: పురపాలక ఎన్నికల్లో ఓటర్లంతా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారులు, ఇతర సిబ్బంది ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యలమంచిలి తహసీల్దార్, మున్సిపల్ ఎన్నికల అధికారి కె.వరహాలు సూచించారు. శుక్రవారం రాత్రి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని వార్డుల్లో పోలింగ్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన వివిధ అంశాలను వివరించారు. 4 వార్డులకు ఒక ఎన్నికల అధికారిని నియమించారని, వారంతా ఈ నెల 25, 26 తేదీల్లో ఆయా వార్డుల్లో ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, నిర్వహించిన ప్రాంతం వివరాలతో కూడిన నివేదికను మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాదరాజు పాల్గొన్నారు.


