పాయకరావుపేట: గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడిపై పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. నర్సీపట్నం మండలం పీనారిపాలెం గ్రామానికి చెందిన నోట్ల చినరామకృష్ణ అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయిని సేకరించి, సమీప జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తూ విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. గతంలో అతనిపై పాయకరావుపేట, కోటనందూరు, కొయ్యూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. 1,100 కిలోలకు పైగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. సీఐ వినోద్బాబు, ఎన్డీపీఎస్ సీఐ పి.రమేష్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని శనివారం జైలుకు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.


