● సరిహద్దు గ్రామాల్లో భారీగాబెల్లం ఊట, సారా నేలమట్టం
● ఏపీ, ఒడిశా ఎకై ్సజ్, పోలీసు శాఖల ఉమ్మడి ఆపరేషన్
సాక్షి, పాడేరు: ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. అల్లూరి జిల్లా సరిహద్దున ఉన్న ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్ పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఈ దాడులు చేపట్టారు. సరిహద్దు గ్రామాల నుంచి నాటుసారా తయారీ, అక్రమ రవాణా అధికంగా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఏపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
ఒడిశాలోని ప్రధానిపుట్టు (వేలంపుట్టు) ప్రాంతంలో 3,600 లీటర్ల బెల్లపు ఊట, 160 లీటర్ల నాటుసారాను, ఒండ్రుగెడ్డ ప్రాంతంలో 3,400 లీటర్ల బెల్లపు ఊట, 310 లీటర్ల నాటుసారాను గుర్తించి ధ్వంసం చేశారు. మొత్తం 7 వేల లీటర్ల బెల్లపు ఊటతో పాటు 470 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఒడిశా ఎకై ్సజ్ సీఐ సుధార్కుమార్, ఎస్ఐ రాజు, పాడువా పోలీసు ఎస్ఐ గోపాలకృష్ణ, అల్లూరి జిల్లాకు చెందిన సీఐలు, ఎస్ఐలు ఆచారి, జగదీష్, తేజ్, నమ్రత, శ్రీధర్, గణేష్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


