● తక్షణమే సరిదిద్దాలి
● మాజీ జెడ్పీటీసీ పోతురాజుబాలయ్యపడాల్ డిమాండ్
చింతపల్లి: గిరిజన సహకార సంస్థ పూర్తి నిర్వీర్యమయ్యే దశకు చేరిందని, ఈ సంస్థను కాపాడడానికి పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించి గాడిలో పెట్టాలని తాజా మాజీ జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనులు పండించి, సేకరించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి, దళారుల దోపిడీ నుంచి రక్షించేలా గిరిజన సహకార సంస్థను ఏర్పాటు చేశారన్నారు. గిరిజనుల సంక్షేమానికి అండగా నిలుస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది గిరిజనులకు ఉపాధి కల్పించిన జీసీసీ నేడు నష్టాల్లో కూరుకుపోయి నిర్వీర్యమయ్యే పరిస్థితికి చేరుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాలక్రమేణా రాజకీయ జోక్యం, ఇతర శాఖల ఉద్యోగుల ప్రాబల్యం పెరిగిపోవడంతో సంస్థ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయిందని ఆరోపించారు. చింతపల్లి డివిజన్‌లో కోట్లాది రూపాయల అవి నీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్లు, గ్యాస్ గోదాములు, పెట్రోలు బంకుల నిర్వహణలో పని చేసిన ఉద్యోగులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్యాస్ గోదాముల ఇన్‌చార్జిల మార్పులోనూ పారదర్శకత పాటించాలన్నారు. సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక అసలు కారణాలను సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన సహకార సంస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.


