అరకులోయ టౌన్: టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పద్మాపురం, పెదలబుడు, వాలసీ పంచాయతీలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అరకులోయ టీడీపీ ఇన్‌చార్జి సియ్యారి దొన్నుదొర సమక్షంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. రోజురోజుకూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం టీడీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అరకు నియోజకవ ర్గంలో వైఎస్సార్‌సీపీకి అపారమైన ప్రజాదరణ ఉందని, ప్రజల్లో పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని మానుకోవాలని, వాస్తవాలను ప్రజలంతా గమనిస్తున్నారని హితవు పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాల్లో 90 శాతం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధీమా వ్యక్తం చేశారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


