అరకులోయ టౌన్: అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి చిత్రపటానికి వాయుపుత్ర మోటార్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారం అరకు రైల్వే స్టేషన్ వద్ద క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వాయుపుత్ర మోటార్ యూనియన్ అధ్యక్షుడు పాంగి నాగర్జున మాట్లాడుతూ.. విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకల పునరుద్ధరణకు కృషి చేసిన ఎంపీ తనూజరాణికి మోటర్, ఆటో, బొర్రా ట్రైబల్ టాక్సీ యూనియన్‌ల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రయాణికులు, డ్రైవర్ల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆమె వెంటనే స్పందించి రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి శుక్రవారం నుంచి రైలు రాకపోకలు పునరుద్ధరించేలా కృషి చేయడం ఎంతో హర్షనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోటర్ యూనియన్ కార్యదర్శి ఎం. రమణ, కోశాధికారి జన్ని రాము, ఆటో యూనియన్ అధ్యక్షుడు మోహిద్దిన్, వైస్ ప్రెసిడెంట్ జగ్గారావు తదితర యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


