మునగపాక : ఖాతాదారుని పేరు ఒక్కటే..గాని వ్యక్తులు వేర్వేరు. ఇరువురు ఖాతాదారులు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలో భాగంగా జరిగిన తప్పును తెలుసుకొని సర్దుకుపోయారు. అయితే సంబంధం లేని వ్యక్తి బ్యాంక్ వద్ద హల్‌చల్ చేయడం చర్చనీయాంశమైంది. మునగపాక గ్రామంలో శెట్టిబలిజ కాలనీకి చెందిన పోలారపు జ్యోతి 28–03–2015న నాగులాపల్లి యూనియన్ బ్యాంక్‌లో ఖాతా తెరిచారు. అదే ప్రాంతానికి చెందిన పోలారపు జ్యోతి పేరిట 2016లో అదేబ్యాంక్‌లో మరో ఖాతా తెరిచారు. అయితే వెనుక అకౌంట్ తెరిచిన జ్యోతికి 28–03–2015న ఖాతా ప్రారంభించినట్టు పుస్తకం అందజేశారు. ఇరువురిలో ఒక జ్యోతి స్థానికంగా పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. సంబంధిత బ్యాంకుకు ఆమె జీతం క్రమం తప్పకుండా క్రెడిట్ అవుతూ వస్తుంది. రెండవసారి అకౌంట్ ప్రారంభించిన జ్యోతి బ్యాంక్ ఖాతాలో రెండేళ్లుగా తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలకు రూ.52వేలతో పాటు మరో 5వేల నగదు వెరసి రూ.57వేల నగదు ఖాతాలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం జ్యోతి తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో కంగుతిన్న ఆమె స్థానిక బ్రాంచి అధికారులను ఆశ్రయించింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కలుగజేసుకొని విషయాన్ని పరిశీలించి గతంలో బ్యాంక్ అధికారుల చిన్నపాటి తప్పిదం కారణంగా పొరపాటు జరిగిందని వారికి నచ్చచెప్పారు. ఈ సమయంలో మునగపాకకు చెందిన ఒక వ్యక్తి తనకు సంబంధం లేకున్నా బ్యాంక్ వద్ద హల్‌చల్ చేసి బ్యాంక్ అఽధికారులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడంతో అసహనం వ్యక్తమైంది. ఇరువురు ఖాతాదారులు జరిగిన తప్పును గుర్తించి సర్దుకుపోతుంటే సంబంధం లేని వ్యక్తి హల్‌చల్ చేయడం ఎంతవరకు సమంజసమని బ్యాంక్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బ్యాంక్ అధికారులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.


