సాక్షి, పాడేరు: శ్రావణమాసం మూడో శుక్రవారం, పవిత్ర రక్షాబంధన్ సందర్భంగా గురువారం పాడేరు మార్కెట్ కళకళలాడింది. పట్టణంలోని మెయిన్ రోడ్, పాత బస్టాండ్, సినిమా హాల్ సెంటర్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి రాఖీలు విక్రయాలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంతాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా యువతులు రాఖీలు కొనుగోలు చేయడానికి భారీగా తరలివచ్చారు. బంగారు దుకాణాల్లో వెండి రాఖీలకు ప్రత్యేక ఆదరణ కనిపించింది. మరో వైపు శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి అవసరమైన పూజా సామగ్రి కొనుగోలుకు మహిళలు మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూలు, పండ్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగి వ్యాపారులకు మంచి ఆదాయం అందింది.


