అరకులోయ టౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకులోయ మండలంలోని బూత్ నంబర్లు 213 నుంచి 271 వరకు, అలాగే 107 నుంచి 163 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో అనుమానాస్పదంగా వందల సంఖ్యలో ఓటర్ల నమోదు జరిగినట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఒకే ఫొటోతో రెండు ఓట్లు నమోదు కావడం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం, ఒకే వ్యక్తి పేరుతో రెండు వేర్వేరు బూత్‌లలో ఓట్లు ఉండటం వంటి తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నకిలీ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి అరకులోయ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల తహసీల్దార్లు, డీటీలకు లిఖితపూర్వకంగా లేఖలు పంపినట్లు తెలిపారు. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి సమగ్రంగా విచారణ జరపాలని, అర్హులైన నిజమైన ఓటర్లను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసి, ఆధారాలు సమర్పించుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నకిలీ ఓటర్లుగా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఓటు హక్కును తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేస్తూ, 100 శాతం పారదర్శకతతో ఓటర్ల జాబితా రూపొందించాలని ఎన్నికల అధికారులను ఎమ్మెల్యే మత్స్యలింగం కోరారు.


