గూడెంకొత్తవీధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం మనందరి అజెండా వైఎస్సార్‌సీపీ జెండాగా ఉండాలని సూచించారు. గూడెంలో పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడం, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడం, నిరుద్యోగ భృతి అమలు కాలేదని ఆయన గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కమిటీ సూచనలకు ప్రాధాన్యం ఇస్తామని, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, రాష్ట్ర పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు వసుపరి తిమోతి, వైస్ ఎంపీపీ లోతా దేవుడు, కోశాధికారి కుందేరి రామకృష్ణ, ఎంపీటీసీ కొర్రా రాజులమ్మ, మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, రీమెలి బాలకృష్ణ, మాజీ జడ్‌పీటీసీ సభ్యులు మత్స్య రాజు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు పనసల రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడు లంబసింగి రమేష్, రైతు విభాగం అధ్యక్షుడు కంకిపాటి రామారావు, మండల ప్రధాన కార్యదర్శి బుజ్జిబాబు, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
మనందరి అజెండా
వైఎస్సార్‌సీపీ జెండాగా మారాలి
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనుఎండగట్టాలి
గూడెం కార్యకర్తల సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు


