ఏయూలో విచారణ పేరుతో అధికారుల బరితెగింపు
‘సంతోష’ంగా తెగబడి మరీ పిండుకుంటున్న వైనం
కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, చిరుద్యోగులనూ వదలని వసూళ్ల పర్వం
గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు పలువురు యోచన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ వైపు లాభదాయకమైన డిఫెన్స్ కోర్సులను ఎత్తివేస్తూ ప్రైవేటు సంస్థలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విచారణ పేరుతో అధికారుల వసూళ్ల పర్వం హద్దులు దాటుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విభాగాల్లో తప్పులు జరిగాయని ఒప్పుకోవాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతోపాటు.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీర్లు, చిరుద్యోగుల వరకు ఎవరినీ వదలకుండా విచారణను వసూళ్ల అస్త్రంగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ కాంట్రాక్టరు డబుల్ బిల్లులు తీసుకున్నారంటూ రికార్డుల్లో నమోదు చేసి, కేసులు పెడతామని బెదిరిస్తూ రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇదే తరహాలో ఇంజనీర్లు, చిరుద్యోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ‘సంతోష’ంగా చక్రం తిప్పిన ఓ అధికారితోపాటు మరో ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు ఆధారాలతో సహా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
టార్గెట్లు పెట్టి మరీ..!
విచారణ పేరుతో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులను భయపెట్టడంతోపాటు.. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే చివరి వరకు వేధిస్తామంటూ బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కో వర్గానికి లక్ష్యాలు నిర్దేశించి మరీ డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏయూలో పనిచేస్తున్న సుమారు 11 మంది ఇంజనీర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.22 లక్షలు విచారణ పేరుతో వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీలో వివిధ పనులు చేపట్టే ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.15 లక్షలు, ఏయూలో పలు కార్యక్రమాలు నిర్వహించే మరో సంస్థ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. చిన్న ఉద్యోగుల నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు, ఉద్యోగ సంఘాల నేతల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంత ఇవ్వాలో ముందే లక్ష్యాన్ని నిర్దేశించి వసూళ్లు చేసినట్టు ఆరోపణలు రావడం గమనార్హం.
త్వరలో గవర్నర్ వద్దకు!
ఏయూ ప్రతిష్టను దెబ్బతీసే నిర్ణయాలతోపాటు.. ఉద్యోగులు, కాంట్రాక్టు సంస్థలపై విచారణ పేరుతో ఒత్తిళ్లు, వసూళ్ల ఆరోపణలు వర్సిటీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. తమకు జీవనోపాధి కల్పిస్తున్న సంస్థను ఇష్టారాజ్యంగా బలహీనపరచడమే కాకుండా, విచారణల పేరుతో వేధింపులకు గురిచేయడం ఏమిటని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విచారణ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలకమండలి అనుమతి లేకుండా వీసీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న పలు నిర్ణయాలనూ ఫిర్యాదులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు.. ఫిర్యాదు ప్రతిని పంపాలని కొందరు యోచిస్తున్నట్టు సమాచారం. గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశిస్తే.. విచారణ పేరుతో జరిగిన వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.
దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట!
వాస్తవానికి ఏయూ ప్రతిష్టను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి కృషితో మరింత పెంచారనే అభిప్రాయం ఉంది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఏయూలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కేంద్రంలో సైనికులు, సైనికాధికారులు ఉన్నత విద్య అభ్యసించారు. వైమానిక, నౌకా, భూసేనలతోపాటు ఐఎన్‌ఎస్ వంటి సంస్థలతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. వేలాది మంది రక్షణశాఖ సిబ్బంది డిగ్రీ లు, పీహెచ్‌డీలు పూర్తి చేశారు. అగ్నివీరులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న తొలి విశ్వవిద్యాలయంగానూ ఏయూ గుర్తింపు పొందింది. 7వేల మందికిపైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యు యేషన్ పూర్తి చేసినట్టు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి డిఫెన్స్ సెంటర్‌ను మూసివేయడంపై ప్రశ్న లు తలెత్తుతున్నాయి. పరిణామాల నేపథ్యంలో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ రాజీనామా చేయగా.. సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడారు. డిఫెన్స్ కోర్సులు నిలిచిపోవడంతో అడ్మిషన్లు గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లేలా నిర్ణయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గత ప్రభు త్వ హయాంలో అవినీతి జరిగిందంటూ విచారణలు చేపట్టి.. ఆ పేరు తో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఇంటిని చక్కదిద్దాల్సింది పోయి గోడలు కూల్చిన చందంగా’ ఏయూ ప్రతిష్టను కాపాడాల్సినవారే సంస్థను మరింత అప్రతిష్టపాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


