పాడేరు రూరల్: గిరిజన సహకార సంస్థ రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. పాడేరు మొదకొండమ్మతల్లి కల్యాణ మండపంలో ఆదివారం గిరిజన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా రేషన్ డీలర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం, ఉన్నత అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. చాలిచాలని వేతనాలతో డీలర్లు దుర్భర జీవితం గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. డీలర్లపై ఈ స్థాయి వివక్ష చూపడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న డీలర్ల ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన డీలర్లు కల్యాణ్ పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శ


