కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తగదు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తగదు

Aug 24 2026 12:19 AM | Updated on Aug 24 2026 12:19 AM

పాడేరు రూరల్‌: ప్రభుత్వ విద్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం మధురవాడ (మారికవలస)లోని గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ పాడేరు ఐటీడీఏ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష ఆదివారంతో 13వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడిన ఆయన.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పేరుతో ఉన్న గురుకుల పాఠశాలను ఎత్తివేసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఉన్నట్లుండి మారికవలస పాఠశాలను ఎత్తివేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. 2004లో ఆదివాసీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలను అర్ధంతరంగా రద్దు చేయడం విద్యార్థుల పట్ల కక్షసాధింపు చర్యేనని విమర్శించారు. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. మొదట 5 నుంచి 8 తరగతులను తొలగిస్తున్నట్లు ప్రకటించి, ఇప్పుడు 9, 10 తరగతులను కూడా లేకుండా చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. ఆదివాసీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ తప్పిదాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, విద్యార్థులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ రాజేష్‌, పోరాట కమిటీ కన్వీనర్‌ రమే ష్‌నాయుడు, శ్రావణి, మత్స్యరాజు, రాజారావు, రాంబాబు, గణపతి, త్రినాథ్‌, శేషు పాల్గొన్నారు.

ఆదివాసీ సమాఖ్య

జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement